వర్ణం: పంటకోసం యుద్ధం
ఇండోనేషియాలోని సూంబా దీవుల్లో వెయ్యేళ్లుగా జరుగుతున్న వేడుక ఇది! ఏటా జరిగే పసోలా పండగలో భాగంగా అక్కడి తెగప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, గుర్రాల్ని పరుగెత్తిస్తూ, వెదురు కర్రల్ని పరస్పరం విసురుకుంటూ ఉత్తుత్తి పోరాటం చేస్తారు. చూసేవాళ్లు తమలపాకులు నములుతూ ఎర్రగా పండిన నోళ్లతో యుద్ధవీరుల్ని ఉత్సాహపరుస్తారు. ఇలా చేస్తే వరి బాగా పండుతుందని వారి విశ్వాసం!
ఎవరు స్పార్టకస్?
ఈ పోటీని ‘స్పార్టకస్ సర్వైవల్ రన్’ అని పిలుస్తారు. చిత్రమైన పదిరకాల హర్డిల్స్ దాటుకుంటూ, పది కిలోమీటర్ల దూరం పరుగెత్తుకుంటూ పోవాలి. ఇదికాదుగానీ, ఇదే స్పార్టకస్ పేరుతో ‘స్పార్టథ్లాన్’ పోటీలు కూడా జరుగుతుంటాయి. లక్ష్య దూరం 246 కిలోమీటర్లు! నమ్మశక్యంగా లేదా? క్రీ.పూ. 490 నాటి సంగతి! తమమీదకు పర్షియన్లు దండెత్తి వస్తున్నారని గ్రీకులకు తెలిసిందట. దాంతో సైన్య సహకారం కోరుతూ స్టార్టాకు ఫీడిప్పైడ్స్ అనే వార్తాహరుణ్ని పంపారు.
అతడు ఒకటిన్నర రోజులో 246 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడట! చరిత్రగా లిఖించివున్న ఈ సంఘటనలోని నిజానిజాల్ని పరిశీలించేందుకు 1983 లో ఒక బృందం ప్రయత్నించింది. అది దాదాపుగా సఫలం కావడంతో, అలాంటి పోటీలు ప్రారంభమైనాయి. గ్రీసుకే చెందిన యానిస్ కోరస్ అనే అల్ట్రామారథాన్ రన్నర్ ఈ దూరాన్ని 20 గంటల 25 నిమిషాల్లో పరుగెత్తడం ఇప్పటికీ వరల్డ్ రికార్డ్!
ఓ మై డాగ్!
రోజూ తినే ఇంటిభోజనానికి భిన్నంగా మనుషులు వారాంతాల్లో ఏ రెస్టారెంటుకో వెళ్తారు. మరి ఆధునిక జీవితంలో మనుషులతో సమానంగా ఆదరణను ఆశిస్తున్న శునకాల సంగతి! వాటికోసమే చెకొస్లొవేకియాలో ‘పెస్టారెస్’ మొదలైంది. పెస్టా అంటే అక్కడి భాషలో కుక్క! పెంపుడుకుక్కల్ని ఇలా సరదాగా బయటికి తెచ్చి, వాటికి నచ్చినవి తినబెట్టి, వాటితో మా మంచి యజమాని అనిపించుకోవచ్చు!