గోధుమ గడ్డి రసంతో పలు వ్యాధుల నివారణ! | Prevention of many diseases with Wheat grass juice | Sakshi
Sakshi News home page

గోధుమ గడ్డి రసంతో పలు వ్యాధుల నివారణ!

Published Mon, Aug 11 2014 4:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

గోదుమ గడ్డి తయారు చేస్తున్న సిరియాల్ రెడ్డి

గోదుమ గడ్డి తయారు చేస్తున్న సిరియాల్ రెడ్డి

 హైదరాబాద్(సుందరయ్య విజ్ఞాన కేంద్రం):  మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో ఆసిడ్‌లు, ప్రోటీన్‌లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు.
రసం  ప్రాముఖ్యత
 గోధుమ గడ్డి మానవాళికి ప్రక ృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది.  దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్‌మొర్. ఐతే ఎల్‌బీ నగర్‌కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్రయిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు 20 రూపాయలు. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు  చెబుతున్నారు.
  తయారీ విధానం
 గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది.  20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును.
 రసంతో కలిగే లాభాలు
* కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది.
* మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది.
* రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది.
* రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ
* గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం,  నల్లబడటాన్ని నివారించవచ్చు.
* గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది.
* శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది
* శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
  ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది
 ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్‌లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి  బాగాపనిచేస్తుంది.    
  -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు
 మంచి ఫలితాలను ఇస్తుంది
 గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్‌లో ఉంది.    
  -శ్రీహరి, చిక్కడపలి
 నాకు నరాల బలహీనత తగ్గింది
 నేను 1959 మొదటి బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్‌కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  
-డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement