మళ్లీ తెరపైకి పద్య హరిశ్చంద్ర
అప్పుడెప్పుడో 1913లో దాదాసాహెబ్ ఫాల్కే హరిశ్చంద్రుడి కథను ‘రాజా హరిశ్చంద్ర’గా తెరకెక్కించారు. అది మూకీ చిత్రం. టాకీలు వచ్చిన తర్వాత కూడా హరిశ్చంద్రుడి కథ దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ తెరకెక్కింది. దాదాపు యాభయ్యేళ్ల కిందట తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘సత్య హరిశ్చంద్ర’ ప్రేక్షకాదరణ పొందింది. అంతకంటే ముందు ‘సత్యహరిశ్చంద్ర’ పద్యనాటకం తెలుగునాట ప్రఖ్యాతి పొందింది.
మళ్లీ ఇన్నాళ్లకు ‘సత్య హరిశ్చంద్ర’ తెలుగులో సినిమాగా రూపొందింది. తాజాగా రూపొందిన ‘సత్య హరిశ్చంద్ర’ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా పద్యనాటకం ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు. రంగస్థల నటీనటులతోనే తెరకెక్కించిన ఈ చిత్రంలో డబ్బింగ్, ప్లేబ్యాక్ వంటివేమీ లేవు. ఇందులో ప్రధానమైన హరిశ్చంద్ర పాత్రను ఒక మహిళ పోషించడం విశేషం. హైటెక్ కాలంలో ‘సత్యహరిశ్చంద్ర’ పద్యనాటకాన్ని సినిమాగా ఎందుకు రూపొందించారనే దానిపై ఈ చిత్ర బృందం అభిప్రాయాలు వారి మాటల్లోనే...
ఆదరిస్తారనే నమ్మకం ఉంది
సంస్కృతీ సంప్రదాయాలను కొత్త తరానికి చేరువ చేయడానికి సినిమాను మించిన సాధనం లేదు. అందుకే పద్యనాటకాన్ని కొత్త తరానికి పరిచయం చేసేందుకే ఈ సినిమా తీశాం. దీనిని ప్రేక్షకులు ఆదరిస్తారనే భావిస్తున్నా. ‘సత్య హరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనను తిలకిస్తే అంతా సుభిక్షంగా ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకే ఇప్పటికీ ఊళ్లలోనూ ఈ నాటక ప్రదర్శనను ఏర్పాటు చేయిస్తుంటారు. చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా, సాంకేతిక నిపుణులు, నటీనటులు సహకరించడంతో నిర్మాణాన్ని విజయవంతంగానే పూర్తిచేయగలిగాం.
- కొత్తపల్లి సీతారాము, నిర్మాత
నేటి తరం కోసమే..
ఇంగ్లిష్ మీడియం చదువుల ప్రభావంతో పిల్లలు మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని నాటకం కంటే సినిమా ద్వారానే ఆకట్టుకోగలం అనిపించింది. అందుకే నైతిక విలువలను బోధించే ‘సత్య హరిశ్చంద్ర’ పద్యనాటకాన్ని సినిమాగా రూపొందించాలని సంకల్పించాం. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మందరాడ. యాభయ్యేళ్లకు పైగా నాటకాలు వేస్తున్నా. తొలిసారిగా సినిమాను తెరకెక్కించడం కొత్త అనుభవం. నాకు పేరు తెచ్చిన నక్షత్రకుడి పాత్రే ఇందులోనూ చేశా.
- వై.గోపాలరావు, దర్శకుడు
ఆ పాత్రలో రెండువేల సార్లు...
రంగస్థలంపై ‘సత్య హరిశ్చంద్ర’ నాటకాన్ని దాదాపు రెండువేల సార్లు ప్రదర్శించాను. హరిశ్చంద్ర పాత్రతోనే నాకు పేరు వచ్చింది. అలాగే ‘గయోపాఖ్యానం’లో అర్జునుడి పాత్ర కూడా... మాది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామం. ఏడో తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించాను. పౌరాణిక నాటకాలకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఆదరణ తగ్గింది.
- కె.మంగాదేవి, నటి