‘ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను మోస్తున్న అసదుద్దీన్’
‘ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోస్తున్న అసదుద్దీన్’
Published Fri, Jan 13 2017 3:01 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM
హైదరాబాద్: ముస్లీం రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టడంపై కేసిఆర్ సర్కార్ న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించాలని శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కోర్టులో నిలబడేలా పకడ్బందీగా బిల్లును రూపొందించాలని, అలా కాకుండా కేసిఆర్ ఇష్టానుసారంగా బిల్లును తెస్తే.. అది కోర్టులో నిలబడకపోతే అందుకు కేసిఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముస్లింల మక్కా యాత్రకు సబ్సిడీ అనవసరమన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఈ వ్యాఖ్యలు బీజేపీ మెప్పు కోసమే అన్నట్లుగా ఉన్నాయన్నారు. జీవితంలో ఒక్కసరైనా మక్కాకి వెళ్లాలని ముస్లింలకు ఉంటుందని, బ్రిటిష్ కాలంలోనే 1932 లో సబ్సిడి ప్రారంభమైందని చెప్పారు. ప్రతి ఏడాది 1.72 కోట్ల మంది భక్తులకు కేంద్రం రూ. 690 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం ముస్లింలకే కాకుండా మానస సరోవర్ వెళ్లేవారికి కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు సబ్సిడి రద్దు చేసి నిధులు సంక్షేమానికి మల్లించాలని అసద్ కోరటం సరికాదన్నారు.
ఆర్ఎస్ఎస్ ఎజెండాను అసద్ మోస్తున్నారని ఆరోపించారు. 2004లో రూ. 74 లక్షలున్న మీ ఆదాయం.... 2014 నాటికి రూ.4 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ‘మీరు నేను కోటీశ్వరులం’ ఎన్నిసార్లైనా వెళ్లొచ్చు.. పేద ముస్లింలు మక్కా వెళ్లకూడదా అని ప్రశ్నించారు. అసద్ వెంటనే తన వ్యాఖ‍్యలను ఉపసంహరించుకోవాలి కోరారు.
Advertisement