'31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు కూడా 31 ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి పెట్టాలని సీఎం అదేశించారు. 31 జిల్లాల ఏర్పాటు కూడా హైవర్ కమిటీ నివేదిక ఆధారంగానే జరుగుతుందని అన్నారు. అయితే ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు హైపవర్ కమిటీ పరిశీలనలో ఉన్న నాలుగు జిల్లాలు మినహా.. మరే కొత్త జిల్లా ప్రతిపాదనను పరిశీలించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు కె. కేశవరావు (కేకే) వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేపు (గురువారం) కేసీఆర్‌కు తుది నివేదికను హైపర్ కమిటీ అందజేయనుంది. దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని కేసీఆర్‌ను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కోరారు. అయితే మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది జిల్లాల ప్రకటన ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.