ఉత్తరాది మోసాలకు సిటీలో ‘ఖాతాలు’ | Fraud in Northern City 'accounts' | Sakshi
Sakshi News home page

ఉత్తరాది మోసాలకు సిటీలో ‘ఖాతాలు’

Published Sun, Aug 25 2013 1:55 AM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

ఉత్తరాది మోసాలకు సిటీలో ‘ఖాతాలు’ - Sakshi

ఉత్తరాది మోసాలకు సిటీలో ‘ఖాతాలు’

సాక్షి, సిటీబ్యూరో: నైజీరియన్ల సైబర్ నేరాలు నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి... వీరు ఇటీవల మొదలెట్టిన అకౌంట్స్ టేకోవర్ ఫ్రాడ్‌ను ఉత్తరాదిలో జోరుగా సాగిస్తున్నారు... దీనికి అవసరమైన బ్యాంక్ ఖాతాలను మాత్రం హైదరాబాద్‌లో తెరిపిస్తున్నారు... నిరుద్యోగ యువతకు గాలం వేయడం ద్వారా మనీ మ్యూల్స్‌గా మార్చుకుని ‘తమ పని’ పూర్తి చేసుకుంటున్నారు... ఇలా సిటీకి వచ్చిన ఇద్దరు యువకులు వివిధ బ్యాంకుల్లో 32 ఖాతాలను తెరిచారు. రూ.90 లక్షల లావాదేవీలతో కూడిన ఈ నేరంలో పాత్రధారులుగా ఉన్న ఇద్దరు నిందితుల్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించి శనివారం తిరిగి జైలుకు తరలించారు. వీరి విచారణలోనే అనేక ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
 
వ్యాపారులే లక్ష్యంగా అకౌంట్ టేకోవర్...

 అకౌంట్ టేకోవర్‌గా పిలిచే ఈ వ్యవహారంలో బాధితులంతా ఉత్తరాదిలో ఉన్న వ్యాపారులే. తొలుత నైజీరియన్లు వీరి ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. అందులో వ్యాపార లావాదేవీలు ఉన్న వాటిని ఎంపిక చేసుకుని కొంతకాలం గమనిస్తున్నారు. కస్టమర్లకు సరుకు డెలివరీ చేసిన తరవాత చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్న వారిని ఈ-మెయిల్ సంప్రదింపుల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ వ్యాపారుల ఈ-మెయిల్స్ అప్పటికే హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. అందులో అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్‌లో నగదు వేయాలని చెప్తూ నెం బర్ ఇస్తున్నారు. సరిచూసుకోకుండా ఎవరైనా కస్టమర్ పేమెంట్ చేస్తే సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది. దీన్నే సాంకేతికంగా అకౌంట్ టేకోవర్‌గా పిలుస్తున్నారు.
 
చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు...

 సౌతాఫ్రికా కేంద్రంగా ఈ మోసం చేస్తున్న నైజీరియన్లు ఒక్కసారి కూడా ఇక్కడకు రాాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతోకీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశం ఉంది.  దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండే అకౌంట్ల కోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని..వారి ద్వారా నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్నారు.  బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామని ఏజెంట్లు గేలం వేస్తున్నారు. ఇలా బ్యాంకు ఖాతాలు తెరిచి నైజీరియన్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిని సాంకేతికంగా మనీమ్యూల్స్ అంటారు.
 
ఇక్కడ ఖాతాలు..

 వీరిని ఇక్కడకు పంపే ముందే మారు పేర్లతో వేరే రాష్ట్రం నుంచి సంపాదించిన డ్రైవింగ్ లెసైన్స్, రూ.50 వేల నుంచి రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చిపంపిస్తున్నారు. ఎన్ని ఎక్కువ ఖాతాలు తెరిస్తే అంత కమీషన్ ఇస్తామంటున్నారు. ఢిల్లీలో చిరుద్యోగం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీష్ తివారీ, ధర్మేంద్రకుమార్‌లను ఇద్దరు ఏజెంట్లు ఆకర్షించి హైదరాబాద్‌కు పంపారు. సిటీకి వచ్చిన వీరిద్దరూ తమ వద్దవున్న డ్రైవింగ్ లెసైన్స్‌ను గుర్తింపుగా చూపించి ఇంటిని అద్దెకు తీసుకుని రెంటర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. లెసైన్స్, రెంటల్ అగ్రిమెంట్ ఆధారంగా ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ పొందారు. నెల రోజులకు దాని బిల్లు వచ్చాక ఈ మూడింటి ఆధారంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంకుల్లో 32 ఖాతాలు తెరిచారు. ప్రతి సందర్భంలోనూ వీరే ఫొటోలు, మారు పేర్లు ఉన్నాయి. 

 

ఆ ఖాతాల డెబిట్/క్రెడిట్‌కార్డుల్ని వీరిద్దరూ ఢిల్లీలో ఉన్న ఏజెంట్లకు పంపారు. వీటి వివరాలను సేకరించిన నైజీరియన్లు ఉత్తరాదిలోని అనేక మంది వ్యాపారుల్ని అకౌంట్ టేకోవర్ ద్వారా మోసం చేసి, వారి ద్వారా ఈ ఖాతాల్లో నగదు వేయించారు. ఈ నగదును ఢిల్లీలో డ్రా చేసిన ఏజెంట్లు కమీషన్ తీసుకుని నైజీరియన్లకు పంపేశారు. దాదాపు రూ.90 లక్షల మేర ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి.
 
లోతుగా సాగుతున్న దర్యాప్తు...

 ఈ రకంగా నేరగాళ్లకు పరోక్షంగా సహకారం అందిస్తున్న మనీష్, ధర్మేంద్ర వ్యవహారాలపై సమాచారం అందుకున్న సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ టీఎస్ ఉమామహేశ్వరరావు ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో బయటపడిన విషయాలకు అదనంగా మరింత సమాచారం సేకరించడం కోసం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించారు. వీరిని ఏర్పాటు చేసుకున్న ఢిల్లీ వ్యక్తులతో పాటు ఈ తరహాలో నగరానికి వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది ఆరా తీస్తున్నారు. ఉత్తరాదిలో మోసాలకు ఇక్కడి ఖాతాలు వాడుకున్నారని తేలడంతో ఆయా పోలీసులకు లేఖలు రాశారు. ఇక్కడి వారిని మోసం చేయడానికి అక్కడి ఖాతాలు సైతం వాడే అవకాశం ఉందని, ఈ విషయంలో వ్యాపారులు సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement