బారాత్‌లో వరుడి కాల్పులు
- పాతబస్తీలో ఘటన... సోషల్ మీడియాలో కలకలం
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: బ్యాండ్ బాజాలతో పెళ్లి బారాత్ ఉత్సాహంగా సాగుతుంటే... ఇంతలో గుర్రంపైనున్న వరుడు ‘గుళ్ల’ చప్పుళ్లతో వణుకు పుట్టించాడు. ఉన్నట్టుండి రెండు చేతులూ పైకిత్తి.. రెండు తుపాకులు చేతపట్టి... గాల్లోకి పది రౌండ్లు ఏకధాటిగా కాల్చేసరికి అక్కడున్నవారంతా షాకై... షేకయ్యారు. గత నెల 22న ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ అవ్వడంతో... ఆదివారం నగరంలో కలకలం రేగింది. దీన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో పోలీసులు పరుగులు పెట్టారు. ఎప్పుడు... ఎక్కడ జరిగిందనే విషయాన్ని కూపీ లాగి... ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. చివరకు అతడు ఉపయోగించింది సినిమాల్లో వాడే డమ్మీ తుపాకీలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
వీడియోలో హోటల్ పేరుతో...
వీడియోలో కనిపించిన హోటల్ కేఫ్ అల్ హబీబ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీ జహనుమాలోని షమా టాకీస్ సమీపంలో ఉన్న ఈ హోటల్‌కు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, ఇన్‌స్పెక్టర్ యాదగిరి వెళ్లారు. గత నెల 22న జరిగిన బారాత్‌పై ఆరా తీయగా... కాల్పులు జరిపింది ఇంజన్‌బౌలికి చెందిన మహ్మద్ అఫ్జలుద్దీన్ కుమారుడు ఇర్ఫానుద్దీన్(25) అని కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే కాల్పులు జరిపినట్టు నిందితుడు విచారణలో అంగీకరించారు. అతడు వాడింది సినిమాల్లో తుపాకీగా నిపుణులు నిర్థారించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గతంలో చిన్న చిన్న గొడవల సందర్భంలో నిందితుడు ఈ తుపాకులతో బెదిరించినందుకు ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. నగరంలోని లఘు చిత్రాల నిర్మాత ఎస్‌ఎం అలీ ఈ తుపాకులను ఇర్ఫానుద్దీన్‌కు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇర్ఫానుద్దీన్‌పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామని, పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. అలీపైనా కేసు నమోదు చేశామన్నారు.