భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఓ భర్త, భార్యను టవల్‌తో గొంతు నులిమి హత్య చేశారు. హత్యను మధ్యాహ్నం జరిగిన గొడవ కారణంగా దెబ్బలు తాళలేక మృతి చెందిందంటూ కట్టు కథ అల్లాడు. అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించే సరికి అసలు విషయం తెలిపాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండెడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కె.మల్లేష్(32)కు అదే ప్రాంతానికి చెందిన కె.వెంకటమ్మ(28)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి శ్రీధర్(5), శ్రీదేవి(3) సంతానం. బ్రతుకుదెరువు కోసం 8 నెలల క్రితం బండ్లగూడ సన్‌సీటీ ప్రాంతానికి వలస వచ్చారు. స్థానికంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటమ్మ వాచ్‌మెన్‌గా పని చేస్తూ అందులోనే ఈ కుటుంబం అంతా ఉంటుంది. మల్లేష్ కూలి పని చేస్తున్నాడు. తాగుడుకు బానిసైన మల్లేష్ ప్రతి రోజు తాగి వస్తూ భార్య వెంకటమ్మకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ గొడవకు దిగుతున్నాడు.
ఇదిలా ఉండగా వీరు ఉంటున్న నిర్మాణంలో పని కోసం వచ్చిన ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు కరెంటు విషయమై ఆమెతో గొడవపడ్డారు. ఆ సమయంలో వెంకటమ్మ కరెంట్ కుక్కర్‌లో అన్నం వండుతున్నానని అయిన అనంతరం ప్లగ్ పెడతానని తెలిపింది. ఇదే విషయమై సెంట్రింగ్ కార్మికుడు, వెంకటమ్మకు మధ్య మాటల యుధ్దం జరిగింది. ఇదే సమయంలో సెంట్రింగ్ కార్మికుడు వెంకటమ్మపై చేయి చేసుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన భర్త మల్లేష్‌కు వెంకటమ్మ గొడవ విషయం తెలపడంతో మల్లేష్ సెంట్రింగ్ కార్మికులతో గొడవ పడ్డాడు. సెంట్రింగ్ కార్మికులు ఇద్దరు మల్లేష్‌ను కొడుతుండడంతో అడ్డు వచ్చిన వెంకటమ్మను సైతం కొట్ట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
రాత్రి భార్య, భర్తల ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. అనంతరం పిల్లలకు అన్నం తినిపించి వెంకటమ్మ నిద్రపోయింది. మద్యం మత్తులో ఉన్న మల్లేష్ భార్యపై అనుమానంతో పాటు కోపం ఉండడంతో టవల్‌తో వెంకటమ్మ మెడకు ఉపిరి బిగించి హత్య చేశాడు. ఉదయం ఏమీ తెలియనట్లు గోలగోల చేశాడు. శనివారం రాత్రి గోడవ జరిగిన విషయం, దాడి విషయం స్థానికులు చూడడంతో నిజమే అని నమ్మి విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి భర్తతో పాటు పిల్లలను, స్థానికులను విచారించారు. సెంట్రింగ్ కార్మికులను స్టేషన్‌కు తీసుకువెళ్ళి విచారించారు. విచారణలో తరచూ గొడవ విషయమై వారు చెప్పడంతో భర్తపై అనుమానంతో స్టేషన్‌కు పిలిచి విచారించగా అసలు విషయం తెలిపాడు. భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని దాని విషయమై రోజూ గొడవ జరిగేదని, ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదని, అనుమానంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.
అనుమానంతో భార్యను గొంతునులిమి చంపిన భర్త
Published Sun, Sep 18 2016 7:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement