అమ్మో...జూన్! | Increased school fees | Sakshi
Sakshi News home page

అమ్మో...జూన్!

Published Sun, May 31 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

Increased school fees

   సామాన్యుల బడ్జెట్ రూ.550 కోట్లు
     పెరిగిన స్కూల్ ఫీజులు
     కార్పొ‘రేట్’ స్కూళ్లలో భారీగా వసూళ్లు
     కానరాని విద్యా హక్కు చట్టం

 
 మధ్య తరగతి కుటుంబానికి చెందిన భానుచందర్ తమ పాపను చేర్పించేందుకు ఎల్బీనగర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లాడు. అక్కడ వారు చెప్పిన మొత్తాన్ని విని ఆయన అవాక్కయ్యాడు. నర్సరీకి దాదాపు లక్ష రూపాయలట. డొనేషన్ సుమారు రూ.40 వేలు, ట్యూషన్ ఫీజు రూ.40 వేలు, యూనిఫాం, టై, బెల్ట్, షూలకు రూ. 4 వేలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌కు రూ. 3 వేలు, ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.12 వేలు.. ఇలా పేపర్‌పై లెక్కలు వేసి ఆయన ముందుంచారు. దీన్ని చూసిన ఆయన గుండె గుభేలుమంది. ఆ ఒక్క చోటనేకాదు... పేరొందిన అనేక కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు ఇదే పరిస్థితి. సెంట్రల్, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే పాఠశాలల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకుంటున్నారు. చదువుల వ్యాపారానికి... తల్లిదండ్రులపై పడుతున్న భారానికి ఇది ఓ మచ్చుతునక.
 
 సాక్షి, సిటీబ్యూరో:
 జూన్...ఈ  నెల పేరు తలచుకుంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యేది... తమ బడ్జెట్ బండిపై భారం మోపేదీ ఈ నెలే. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు.. స్కూల్ ఫీజులు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇది సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాల వారికి పెనుభారమవుతోంది. నగరంలో దాదాపు 4 వేల స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం అనేక ప్రైవేటు స్కూళ్లు దాదాపు 80-100 శాతం వరకు పెంచాయి. తాజాగా కొన్ని స్కూళ్లు 10 నుంచి 20 శాతం వరకు పెంచినట్లు సమాచారం. మరికొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచకపోయినా.. డొనేషన్ పేరుతో బాగానే వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది.

మరి ఆ స్థాయిలో వసతులు కల్పిస్తున్నారా? అంటే... లేదు. కొరవడిన నియంత్రణ  నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరానికి అర్బన్ ఏరియాలో 8-10 తరగతి విద్యార్థులకు రూ.12 వేలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ.9 వేల కంటే అదనంగా వసూలు చేయకూడదు. ఒక వేళ అంతకు మించి వసూలు చేస్తే.. ఆ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, విద్యా బోధన తదితర అంశాలపై డీఎఫ్‌ఆర్‌సీకి నివేదిక ఇవ్వాలి. డీఎఫ్‌ఆర్‌సీ ఆమోదం తెలిపితే ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి రాబట్టవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకమేనని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు భావించాయి. ఆ జీఓను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా... 2014 జూన్‌లో స్టే విధించింది. దీంతో ఫీజు చెల్లింపుల విషయంలో నియంత్రణ కొరవడింది. ఫలితంగా ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
 కాగితాలపైనే...
 ఫీజులు తీసుకోవడంలో పోటీ పడుతున్న స్కూళ్లు.. సౌకర్యాల కల్పన, నిబంధనల పాటింపు, విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో పూర్తిగా విఫలమవుతున్నాయి. నగరంలో ఒక్క పాఠశాల కూడా విద్యా హక్కు చట్టం మేరకు నడుచుకుంటున్న దాఖలాలు లేవు.ఆర్టీఈ ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి. ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం విద్యార్థులకు ఉచితంగా చదువు చెబితే తాము పాఠశాలలు మూసుకోవాల్సిందేనని  యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే పేద పిల్లలకు బోధిస్తామని వారు చెబుతుండగా.. ఆ ప్రసక్తే లేదని సర్కారు అంటోంది.
 
 బడ్జెట్ రూ. 550 కోట్లు
 నగరంలో నాలుగు లక్షలకుపైగా విద్యార్థులు జూన్ నెలలో ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టనున్నారు. వాటి స్థాయిని బట్టి మొదటి విడత ట్యూషన్ ఫీజు కనీసం రూ.7 వేలు, బ్యాగు, యూనిఫాంలు, టై, బెల్ట్, డైరీ, ప్రోగ్రెస్ రిపోర్ట్, సాక్సులకు మొత్తం రూ. 3,000 - 4,000, పుస్తకాలకు రూ.1,500, నోట్‌బుక్స్ రూ.800, ట్రాన్స్‌పోర్ట్ రూ. 1,200 ఖర్చు చేయాల్సిందే. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి జూన్ నెలలో దాదాపు రూ. 14 వేలు.. నాలుగు లక్షల మందికి రూ.550 కోట్లకు పైగా తల్లిదండ్రులపై భారం పడనుంది. ఇదంతా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన లెక్క. ఇక సెంట్రల్, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లలో అన్ని రకాల ఫీజులు కలుపుకొని ఏడాదికి ఒక్కో విద్యార్థి వద్ద రూ.2.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
 
 ఏడాది ఖర్చులు      కనిష్టం              గరిష్టం
 డొనేషన్ ఫీజు                      రూ. 10 వేలు                 రూ. లక్ష
 ట్యూషన్ ఫీజు (అన్ని టర్మ్‌లు) రూ. 30 వేలు    రూ. 1.50 లక్షలు
 పాఠ్య పుస్తకాలు                   రూ. 2 వేలు            రూ. 5 వేలు
 నోట్ బుక్స్                           రూ. వెయ్యి            రూ. 2 వేలు
 యూనిఫాం, షూస్, బెల్ట్       రూ. 3 వేలు             రూ. 4 వేలు
 ట్రాన్స్‌పోర్ట్ (దూరాన్ని బట్టి)    రూ. వెయ్యి             రూ. 3 వేలు
 బ్యాగు, పెన్నులు ఇతరత్రా
                                           రూ. వెయ్యి            రూ. 1,500
 
 ఇష్టారాజ్యంగా వసూలు చేయకూడదు
 స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. గవర్నింగ్ బాడీ, పేరెంట్స్‌అసోసియేషన్ సమష్టి నిర్ణయం మేరకే ఫీజులు తీసుకోవాలి. ఏకపక్షంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అంతేగాక జీఓ ఎంఎస్ 1 ప్రకారం 5 శాతం లాభాలు మాత్రమే యాజమాన్యాలు తీసుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల అమలుపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.    - సోమిరెడ్డి, డీఈఓ, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement