నెట్ వేసి ఉచ్చులోకి! | IS social media recruitment center | Sakshi
Sakshi News home page

నెట్ వేసి ఉచ్చులోకి!

Published Mon, Feb 29 2016 12:24 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

నెట్ వేసి ఉచ్చులోకి! - Sakshi

నెట్ వేసి ఉచ్చులోకి!

సోషల్‌మీడియా కేంద్రంగా ఐఎస్ రిక్రూట్‌మెంట్
సిరియా నుంచి కథ నడుపుతున్న షఫీ ఆర్మర్
‘ఓపెన్’తో ప్రారంభించి, ‘యాప్స్’ వరకు
హ్యాకర్ల ద్వారా సైబర్ వార్‌కు కుట్రపన్నిన వైనం
    
 
అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ  ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సోషల్‌మీడియా కేంద్రంగా రిక్రూట్‌మెంట్స్ చేసుకుంటోంది. ఉద్రేక భావాలున్న యువతకు వల వేసి... ఉచ్చులోకి లాగుతోంది. గత ఏడాది వరకు దేశంతో పాటు నగరంలో ఉన్న యువతను ఆకర్షిస్తూ సిరియా దారి పట్టించింది. గత నెలలో దేశ వ్యాప్తంగా గుట్టురట్టైన ‘జునూద్ అల్ ఖలీఫా ఎ హింద్’ మాడ్యుల్‌తో ‘స్థానికంగా’ ఉన్న నగరాలతో పాటు ప్రముఖులు, విదేశీయుల్నీ టార్గెట్ చేసినట్లు స్పష్టమైంది. ఈ ఆపరేషన్ల కోసమే ‘జునూద్’ను ఏర్పాటు చేసుకుని విస్తరిస్తున్నట్లూ స్పష్టమైంది. దేశంలోని 12 నగరాల్లో అరెస్ట్ అయిన 16 మంది ఉగ్రవాదుల్లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఐఎస్’ రిక్రూట్‌మెంట్ మొదలు ఇం‘టై’నెట్ వరకు కార్యకలాపాలపై ‘సాక్షి’ ఫోకస్...
 
సిటీబ్యూరో:  కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఐఎస్‌కు అనుబంధంగా ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి ‘జునూద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు. వివిధ రకాలైన పేర్లతో ఇంటర్‌నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయస్సు ప్రస్తుతం 27 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి.
 
ఫోరమ్... పేజ్... యాప్స్...
షఫీ ఆర్మర్ తనకు ‘అనువైన వారిని’ గుర్తించడానికి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనేక పేర్లతో వందల సంఖ్యలో అకౌంట్లు నిర్వహిస్తున్న షఫీ ప్రాథమికంగా ఫేస్‌బుక్, ట్విటర్ వంటి మాధ్యమాల్లోని ‘ఓపెన్ ఫోరమ్స్’లో ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి/దేశాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తాడు. వీటికి ఆకర్షితులైన అనేక మంది స్పందిస్తుంటారు. ఈ స్పందనల్ని క్షుణ్ణంగా పరిశీలించే షఫీ... ఉద్రేకపూరిత, విపరీతమైన వ్యాఖ్యలు చేసిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిని వ్యక్తిగతమైన ‘పేజ్’ల్లోకి ఆహ్వానిస్తూ భావజాల వ్యాప్తిని కొనసాగిస్తాడు. పూర్తిగా వలలో పడిన వారిని ఎంపిక చేసుకుని... వివిధ రకాలైన ‘వాట్సాప్’, ‘హైక్’, ‘సిగ్నల్’, ‘ట్రిలియన్’, ‘స్కైప్’ సహా వివిధ రకాలైన యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ పూర్తిగా ఉచ్చులోకి లాగేస్తాడు. ఇలా  ఆకర్షించడం ద్వారా దేశం దాటి సిరియా వచ్చేలా చేయడమో, దేశంలోనే విధ్వంసాలు సృష్టించేలా ప్రేరేపించడమో చేస్తుంటాడు.
 
పక్కాగా టాలెంట్ స్కౌటింగ్ టీమ్...

సోషల్ మీడియా ద్వారా ఆకర్షణ, రిక్రూట్‌మెంట్, సంప్రదింపులు జరపడానికి షఫీ ఆర్మర్ సిరియా కేంద్రంగా ‘టాలెంట్ స్కౌంటింగ్ టీమ్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానంలో పట్టున్న వారిని ఎంపిక చేసుకోవడంతో పాటు కొంత శిక్షణ సైతం ఇప్పించాడని నిందితులు వెల్లడించారు. సోషల్ మీడియాల్లో ఐఎస్‌కు సంబంధించిన వాటితో పాటు పలు రకాలైన ఉద్రేకపూరితమైన పోస్టులు పెట్టడం నుంచి ‘లైక్స్’, ‘కామెంట్స్’ను విశ్లేషించడం, ‘అనువైన వారిని’ గుర్తించడం వరకు ఈ బృందాలే పని చేస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత మాత్రమే నేరుగా రంగంలోకి దిగే ఆర్మర్... మారు పేర్లతో ‘యాప్స్’ ద్వారా సంప్రదింపులు జరుపుతాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంటర్‌నెట్ అనేది సెల్‌ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చాక ‘ఆన్‌లైన్ టై’ పెరిగిందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు రిక్రూట్‌మెంట్స్  కోసం షఫీ ఆర్మర్ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. గత ఏడాది దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చిన నగర యువతి ఆఫ్తా జబీన్ అలియాస్ నిక్కీ జోసఫ్ సిటీకే చెందిన సల్మాన్ మెయినుద్దీన్‌ను ఫేస్‌బుక్ ద్వారా ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రేరేపించింది. ఇతడిని 2014లో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ కేసులోనే నిక్కీని డిపోర్టేషన్‌పై తీసుకువచ్చారు. ఈమె నిఘా వర్గాల విచారణలో ఓ వ్యక్తిని ఐఎస్‌కు రిక్రూట్ చేస్తే తనకు ‘హ్యాండ్లర్’ నుంచి రూ.50 వేల వరకు అందేవని వెల్లడించింది.
 
హ్యాకర్లకు భారీగా ఎర..
విధ్వంసాలకు కుట్ర చేయడం ద్వారా ప్రత్యక్ష ‘యుద్ధాన్ని’ ప్రకటించిన షఫీ ఆర్మర్... మరోపక్క సైబర్ వార్‌కూ పథకం వేశాడు. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన, రక్షణ శాఖ వెబ్‌సైట్లకు హ్యాకింగ్ చేయించాలని ఆర్మర్ కుట్రపన్నిట్లు పట్టుబడిన నిందితులు వెల్లడించాడు. దీనికోసం సోషల్‌మీడియా ద్వారానే కొందరు హ్యాకర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసినట్లూ బయటపెట్టారు. ఈ హ్యాకర్లకు నెలకు పదివేల డాలర్లు చెల్లించడానికీ షఫీ సిద్ధమైనట్లు నిందితుడు స్పష్టం చేశారు. అయితే ఈ కుట్ర అమలులోకి రాకముందే ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు కావడంతో బ్రేక్ పడిందని, అయితే దీన్ని కేవలం తాత్కాలిక విరామంగానే పరిగణించాలని నిఘా వర్గాలు చెప్తున్నాయి. షఫీ ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్‌సైట్లపై కన్నేశాడంటే... వాటిలోకి సున్నిత సమాచారం తస్కరించడంతో పాటు బ్లాక్ చేయడానికి హ్యాకర్ల ద్వారా ప్రయత్నించే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాయి.
 
 
భావజాల ‘ప్రచారానికి’ పెద్దపీట...
షఫీ ఆర్మర్ తన భావజాల వ్యాప్తి కోసం ప్రచారానికీ పెద్ద పీట వేస్తున్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం ఇంటర్‌నెట్, సోషల్ మీడియాలతో పాటు ‘దాబిఖ్’ను విస్తృతంగా వాడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఏర్పాటైన అల్ కాయిదా సంస్థ ‘ఇన్‌స్పైర్’ పేరుతో ఓ పత్రికను నిర్వహించేది. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్న ఐఎస్ సైతం ‘దాబిఖ్’ పేరుతో ఈ-మ్యాగ్జిన్‌ను నిర్వహిస్తోంది. ఇటీవలే 13వ ఎడిషన్ విడుదలైంది. దీన్ని సైతం షఫీ ఆర్మర్ దేశంలోని అనుచరగణానికి పంపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. పట్టుబడిన నిందితుల ఈ-మెయిల్స్ తదితరాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరిస్తున్నారు.
 
పేర్లు మార్చి... ఏమార్చి...
భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయపెట్టాలేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది.2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు. 2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు. 2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు.ఈసారి ‘జునూద్’ మాడ్యుల్‌లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు.
 
ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు చీఫ్...

ఒకే సమయంలో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న షఫీ ఆర్మర్ ‘తన దారి’లోకి వచ్చిన వారిలో ‘ఉత్తముల్ని’ ఎంపిక చేసుకుంటున్నాడు. నగరాలు, ప్రాంతాల వారిగా ఇలా అమీర్‌లను ఏర్పాటు చేసి... ఆ ప్రాంతంలో ఉన్న ఇతర అనుచరుల్ని సోషల్‌మీడియా ద్వారానే అతడికి పరిచయం చేస్తాడు. వీరికి నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించడంతో పాటు అవసరమైన ‘వనరులు’, ‘ఇతర సహకారాలు’ సైతం కల్పిస్తాడు. ‘జునూద్’ మాడ్యుల్‌కు ముంబైకి చెందిన ముదబ్బీర్‌ను చీఫ్‌గా చేసిన షఫీ... హైదరాబాద్‌కు చెందిన నఫీస్‌ఖాన్‌ను ఫైనాన్స్ చీఫ్‌గా చేయడంతో పాటు మిగిలిన ముగ్గురైన ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మెయినుద్దీన్, అబు అన్స్‌లకు నేతృత్వం వహించే బాధ్యతల్ని అప్పగించాడు. ‘చీఫ్’లుగా ఉన్న అందరితోనూ నిత్యం సోషల్‌మీడియా ద్వారా సంప్రదింపులు జరుగుతూ రెక్కీలు, టార్గెట్ల ఎంపిక, విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ, ఐఈడీ బాంబుల తయారీ తదితర అంశాలను నేరుగా పర్యవేక్షించే వాడు.
 
 
1.  సల్మాన్ మొహియుద్దీన్ (బజార్‌ఘాట్) నిక్కీ జోసెఫ్ అనుచరుడు
2. సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ  (చాంద్రాయణగుట్ట)
3. మాజ్ హసన్ ఫారూఖ్  (హుమాయున్‌నగర్)
4. అబ్దుల్లా బాసిత్ (చాంద్రాయణగుట్ట) ఈ ముగ్గురూ కాశ్మీర్ వెళ్లే ప్రయత్నాల్లో నాగ్‌పూర్‌లో చిక్కారు.
 7. మహ్మద్ నఫీజ్ ఖాన్ (అమీన్‌కాలనీ, షేక్‌పేట్)
 8. మహ్మద్ షరీఫ్ మెయినుద్దీన్ ఖాన్ (రాఘవకాలనీ, టోలిచౌకి)
 9. అబు అన్స్ (మాదాపూర్‌లో స్థిరపడిన రాజస్థాన్ వాసి)
 10. మహ్మద్ ఒబేదుల్లా ఖాన్ (మొతిదర్వాజ, గోల్కొండ)  హైదరాబాద్‌లో చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్ సభ్యులు
 11. ముదబ్బీర్ ముస్తాఖ్ ( ముంబైలో అరెస్టు అయిన ‘జునూద్’ సంస్థ చీఫ్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement