‘ఆధార్’ను 100% అమలు చేస్తాం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో ఆధార్, బయోమెట్రిక్ ప్రక్రియలను 100 శాతం అమలు చే స్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు స్త్రీ నిధి ద్వారా రూ.1,300 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 55 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్లు ఉన్నారని, అందులో కనీసం 25 లక్షల మందికైనా 100 రోజుల ఉపాధి కల్పించాలని ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కూలీలకు పనులను అప్పగించే ఫీల్డ్ అసిస్టెంట్‌లకు 5 వేల పనిదినాల టార్గెట్‌ను తొలగించి, గ్రామంలో 50 శాతం మంది జాబ్‌కార్డుదారులకు 100 రోజుల ఉపాధి కల్పించడాన్ని టార్గెట్‌గా పెడతామని చెప్పారు. ఉపాధి హామీ, సెర్ప్ తదితర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల పెంపు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడం.. వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జూపల్లి కృష్ణారావు తెలిపారు.