అక్రమాలు బయటకొస్తాయనే...
జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డుల్లో అక్రమాలు బయటకొస్తాయనే భయంతోనే తమను వెళ్లకుండా టీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం విమర్శించారు. భూసేకరణ చట్టం–2013ను అమలు చేయాలని శనివారం డిమాండ్ చేశారు. ప్రజల అవసరాల కోసం భూసేకరణ జరిపితే నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించొద్దని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలసి రిలే నిరాహారదీక్షలకు దిగుతున్నట్లు ప్రకటిం చారు. రైతులకు సమస్యలు ఉన్నాయని సీఎం చెబుతున్నారని, అవే సమస్యలను అధ్యయనం చేయడానికి వెళ్తుంటే అడుగడుగునా టీఆర్‌ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రభుత్వమే భగ్నం చేస్తోందని విమర్శించారు. అరెస్టులతో తమ కార్యాచరణ ఆగదని స్పష్టం చేశారు.