సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గాల్లో రోడ్ల విస్తరణతో స్థలాలు కోల్పోయిన బాధితులకు హైకోర్టు ఊరటనిచ్చింది. స్థలాలు కోల్పోయిన వారికి 2014లో కొత్తగా అమల్లోకి వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. పరిహారాన్ని నిర్ణయించే ముందు బాధితుల వాదనలు విని, ఒక నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలంటూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు భూ సేకరణ అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు నిర్మాణ మార్గాల్లో పలుచోట్ల అధికారులు భూ సేకరణ చేపట్టి, వాటికి ఈ ఏడాదిలో పరిహారం కూడా చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పరిహారం తక్కువగా ఇచ్చారని, నిబంధనల మేరకు చెల్లించలేదని పేర్కొంటూ భూములు కోల్పోయినవారు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలని భూ సేకరణ అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట గడువును నిర్ణయించుకుని, ఆలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి
Published Wed, Dec 3 2014 2:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement