త్వరలో ప్రైవేటు వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు వర్సిటీలు రాబోతున్నాయి. అందుకవసరమైన ముసాయిదా బిల్లులో ఉండాల్సిన అంశాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లుకు తుది రూపు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. బుధ లేదా గురువారం సమీక్షించి బిల్లును సిద్ధం చేయనున్నారు. సంప్రదాయ వర్సిటీల్లో కాలం చెల్లిన కోర్సులు కాకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సుల్ని చేర్చేందుకు ప్రైవేటు వర్సిటీలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టనుంది.
ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్
రాష్ట్రాన్ని, ప్రధానంగా హైదరాబాద్‌ను ‘ఎడ్యుకేషన్ హబ్’గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రైవేటు వర్సిటీలను అనుమతించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉంది. కార్పొరేట్ దిగ్గజాలు కూడా విద్యారంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి సంస్థలు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించగా, బిర్లా సంస్థ కూడా బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది.
వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలూ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఉన్నత విద్యలో ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఉపాధి అవకాశాలు లభిం చనున్నాయి. దీంతో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బిల్లులో ఉండనున్న కొన్ని ప్రధానాంశాలు
► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం.
► జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం, పరస్పర సహకారం వీటి ద్వారా మరింత సులభం కానుంది.
► కోర్సులు, సిలబస్‌పై వర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక అవసరాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సులనే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
► సంస్థల అనుభవం, నైపుణ్యాలు, ట్రాక్ రికార్డును బట్టి వర్సిటీలకు అనుమతిస్తారు.
► విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంస్థలు చేసుకునే దరఖాస్తులు, ప్రతిపాదనలను నిపుణుల కమిటీ నేతృత్వంలో పరిశీలిస్తారు. సరిగ్గా లేదనుకుంటే తిరస్కరిస్తారు.
► ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై నియంత్రణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఉన్నత విద్య ప్రమాణాలు కాపాడటానికి ఈ సంస్థ చర్యలు చేపడుతుంది.
► అందులో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ, ఎంసీఐ, పీసీఐ, ఎన్‌ఏఏసీ, ఐసీఏఆర్, డీబీటీ, డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్, బీసీఐ వంటి సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.