మమతను చంపి.. మానవత మరచి | Relief with Committee for Protection of Child Rights Initiative | Sakshi
Sakshi News home page

మమతను చంపి.. మానవత మరచి

Published Thu, Jul 9 2015 2:09 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యూషను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు - Sakshi

వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యూషను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

ఓ సవతి తల్లి పైశాచికం.... సహకరించిన తండ్రి
ఏడాది పాటు యువతి గృహనిర్బంధం...
బతికుండగానే నరకం చూపించిన వైనం....
బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చొరవతో విముక్తి

 హైదరాబాద్ :  మానవత్వం మరిచిపోయి తనలోని పైశాచికత్వాన్ని ఓ యువతిపై ప్రదర్శించి ప్రత్యక్ష నరకం చూపించింది ఆ సవతి తల్లి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి సైతం కన్నకూతురిని బాధలు పెడ్తుంటే సహకరించడంతో  ఓ యువతి ఏడాదిగా నరకం చూసింది.

ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు బుధవారం ఎల్‌బీనగర్ ఎస్‌ఐ నర్సింహారెడ్డి సాయంతో బాధితురాలు ఉంటున్న ఇంటిపై దాడి చేసి యువతికి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం మేరకు  చిప్ప రమేష్ నాగోలు బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో నివాసముంటూ  జూనియర్ టెలికం అధికారిగా పనిచేస్తున్నారు. 1991లో పుత్లీబౌలి ప్రాంతానికి చెందిన సరళాదేవితో అతనికి వివాహమైంది. వీరికి  ప్రత్యూష జన్మించింది. భార్యాభర్తల మధ్య స్పర్థ్ధలు రావడంతో 2003లో విడిపోయారు.

అనంతరం రమేష్ 2008లో సికిం ద్రాబాద్‌కు చెందిన చాముండేశ్వరి అలియాస్ శ్యామలను రెండో వివాహం చేసుకున్నారు. 2010లో మొదటి భార్య చనిపోవడంతో ప్రత్యూషను ఆమె కుటుంబీకులు మూసాపేటలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు.దీంతో మైనార్టీ తీరిన పాపను  2014లో తండ్రి రమేష్ తన ఇంటికి తీసుకొచ్చారు. ఇది నచ్చని అతని రెండో భార్య చాముండేశ్వరి అప్పటి నుంచి ప్రత్యూషను గృహనిర్బంధం చేసి చిత్రహింసలు పెడుతోంది.

ఇనుప చువ్వలను కాల్చి వాతలు పెట్టేది. యువతి శరీరమంతా కత్తితో గాయపరిచింది.ఆమెతో బలవంతంగా టాయిలెట్లు శుభ్రపరిచే  హార్పిక్, యాసిడ్, సర్ఫ్ వంటి వాటిని తాగించేది. ఆహారం కూడా సరిగా పెట్టకపోవడంతో  ప్రత్యూష శారీరకం గా, మానసికంగా దయనీయస్థితికి చేరుకుంది. ఈ విషయాలన్నీ తెలిసినా  తండ్రి రమేష్ భార్యకే వత్తాసు పలికేవాడు. ఇది ప్రత్యూషను మరింత కుంగదీసింది. ఏడాదిగా సాగిన ఈ అకృత్యాల వల్ల  ప్రత్యూష నడవలేని, మాట్లాడలేని దుస్థితికి చేరింది.

బాధలకు తాళలేక పలుమార్లు ఇంట్లో నుంచి పారిపోదామని యత్నించినా చాముండేశ్వరి చితకబాది అడ్డుకునేది. ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు, ఎల్‌బీనగర్ పోలీసులు బుధవారం ఉదయం వారి ఇంటిపై దాడి చేసి  ప్రత్యూషకు విముక్తి కల్పించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూషపై లైంగిక దాడులు జరిగాయా... అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌బీనగర్ పోలీసులు చాముండేశ్వరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తండ్రి రమేష్ కోసం గాలిస్తున్నా రు. వీరిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, తీవ్రంగా గాయపరిచినందుకు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
 
వేధించిన ఇద్దరిపై హత్యాయత్నం
కేసులు నమోదు చేయాలి: అచ్యుతరావు

ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్రహింసలకు గురిచేసిన తండ్రి రమేష్, మారుతల్లి చాముండేశ్వరిలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు అచ్యుతరావు పోలీసులను ఆదేశించారు. కాగా ప్రత్యూష ఎల్బీనగర్ అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అత్యంత దుర్భరంగా  ఉంది.  

దుస్తులు కూడా సరిగా లేవు. మందులు, ఆహారం, దుస్తులు అవసరం. సహాయం చేయదలిచిన దాతలు వస్తు రూపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు నేరుగా అప్పగించవచ్చని, మరిన్ని వివరాలకు 9866342424 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని అచ్యుతరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement