రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీజేఏసీదే | TJAC will plays the opposision roll, Kodandaram says | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీజేఏసీదే

Published Thu, Mar 24 2016 3:42 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీజేఏసీదే - Sakshi

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర టీజేఏసీదే

- ప్రభుత్వానికి భయం పట్టుకునే జేఏసీని ఖాళీ చేయిస్తోంది: కోదండరామ్
- జేఏసీని కొనసాగించాలంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఏకగ్రీవ తీర్మానం
- వీడిన వాళ్ల గురించి ఆలోచించకుండా కార్యాచరణపై దృష్టి పెట్టాలి
- ఉద్యమ స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని సూచన

 
హైదరాబాద్:
‘‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీ మనుగడ కోసమే టీడీపీని ఖాళీ చేయించింది. ఇప్పుడు తెలంగాణ జేఏసీని నిర్వీర్యం చేస్తోంది. నిశ్చింతగా ఉన్న జేఏసీని కదిలించడమంటే ప్రభుత్వ ఉనికిని పాడు చేసుకోవడమే అవుతుంది. ఉద్యోగ సంఘాల నాయకులు బయటకెళ్లినంత మాత్రాన జేఏసీ బలహీనం కాదు. ప్రతిపక్షమే లేదనుకునే ప్రభుత్వానికి జేఏసీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది’’ అని పలువురు తెలంగాణ రాజకీయ జేఏసీ అనుబంధ సంఘాలు, కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు.

బుధవారం నాంపల్లిలోని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన ‘తెలంగాణ జేఏసీ కొనసాగించాలా.. వద్దా?’ అనే అంశంపై సమీక్షా సమావేశం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జేఏసీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కుల సంఘాలు, జేఏసీ అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారంతా జేఏసీని కొనసాగించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలే ఎజెండాగా పనిచేయాలని, 2019 నాటికి రాజకీయ శక్తిగా జేఏసీ ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. ఆ విధంగా జేఏసీ చైర్మన్ దిశానిర్దేశం చేయాలని కోరారు.

అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ.. బయటకు వెళ్లిన వారి గురించి విమర్శించకుండా కార్యాచరణపై దృష్టి సారించాలని, సమావేశంలో జేఏసీని కొనసాగించాలనే స్ఫూర్తి, ఆకాంక్షను కనబరచడం గొప్ప విషయమన్నారు. ఇకపైనా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని, అప్పుడే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా పనిచేయాలని, అవసరమైతే ఇతర సంఘాల సహాయం తీసుకుని ముందుకెళ్దామని చెప్పారు. స్వార్థానికి పోకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా, ఎవ్వరినీ తిట్టకుండా మన తాపత్రయమంతా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఉండాలని సూచించారు. అనంతరం జేఏసీని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
 
ప్రజా సంఘాలతో సంఘర్షణ వద్దు
ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వెళ్తున్న క్రమంలో ఆ లోటును ప్రజా సంఘాల నేతలు గద్దర్, విమలక్క వంటి వారిని దగ్గరకు చేర్చుకుని జేఏసీని బలోపేతం చేయవచ్చుకదా అని విలేకరులు ప్రొఫెసర్ కోదండరామ్‌ను ప్రశ్నించగా.. పార్టీల రహితంగా జేఏసీ పనిచేయాలనే నిర్ణయంతో ఉందని, ప్రజా సంఘలతో కలసి పనిచేయాలనే ఆలోచన తమకు లేదని, వారితో కలసి పనిచేసే అవకాశం లేనేలేదని స్పష్టం చేశారు. ఏది చేసినా సమాంతరంగా చేయాలనే ఆచార్య జయశంకర్ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ప్రజా సంఘాలతో కలసి పనిచేయాలా.. వద్దా? అనే విషయాన్ని జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చిస్తామన్నారు. అలాగని ప్రజా సంఘాలను విమర్శించబోమని, ప్రజా సంఘాలతో సంఘర్షణ లేకుండా తాము పనిచేస్తామని కోదండరామ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement