డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట మోసం
టీఆర్‌ఎస్ నాయకులపై బాధితుల ఫిర్యాదు
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
బంజారాహిల్స్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని తమ వద్ద డబ్బు వసూలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు టీఆర్‌ఎస్ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ డివిజన్‌కు చెందిన టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహిసిన్ హుస్సేన్, ఆ పార్టీ నాయకుడు శ్రీరాములు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కొంతకాలంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 3 వేల చొప్పున సుమారు 200 మంది వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.
త్వరలోనే ఇళ్లు కేటాయించేలా చేస్తామంటూ మరికొందరి వద్ద రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా ఇళ్లు రాకపోగా... ఇదేమిటని అడిగితే ముఖం చాటేస్తుండటంతో బోరబండ సైట్-3 వీకర్ సెక్షన్ శివగంగా నగర్‌కు చెందిన పద్మతో పాటు రూమా జాస్మిన్, శేఖర్, సుధాకర్, రఘునాథ్, కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో 20 మంది బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులు మొహిసిన్ హుస్సేన్, శ్రీరాములుపై ఐపీసీ సెక్షన్ 406,420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.