ముందుగానే సయోధ్య | Union Water Resources Ministry Meeting on krishna water shares | Sakshi
Sakshi News home page

ముందుగానే సయోధ్య

Published Tue, Jun 14 2016 3:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

ముందుగానే సయోధ్య

ముందుగానే సయోధ్య

కృష్ణా నీటి వివాదాలపై రంగంలోకి కేంద్రం
ఏపీ, తెలంగాణతో 21న కేంద్ర జల వనరుల శాఖ సమావేశం

సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరీవాహకం పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలు, విని యోగాలపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర  రంగంలోకి దిగింది. కృష్ణా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటాల అంశాలపై ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని 2016-17 ఏడాది వర్కింగ్ మాన్యువల్‌ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులకు సమావేశం విషయమై సోమవారం లేఖల ద్వారా సమాచారం అందించారు.

 బోర్డు పరిధిలోనే తాత్కాలిక నియంత్రణ
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నిర్వహణ, బోర్డు పర్యవేక్షణపై రెండేళ్లుగా అస్పష్టత కొనసాగుతోంది. బోర్డు పరిధి, మార్గదర్శకాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత ఏడాది నాగార్జునసాగర్ నీటి విడుదల, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి తదితరాలపై ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ఉన్న దృష్ట్యా, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని తాజాగా కేంద్రానికి ఏపీ విన్నవించింది. వీటితో పాటే హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు వద్ద మెజరింగ్ పాయింట్లు ఉండటానికి అభ్యంతరం లేదని, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ వద్ద కూడా నీటి వినియోగాన్ని లెక్కగట్టాలని, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండాలని కోరుతోంది.

దీనిపై సానుకూలంగా స్పందించిన బోర్డు ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా అడ్డుకుంది. దీంతో ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో కుదిరిన వర్కింగ్ మాన్యువల్‌పై మాత్రం త్వరలోనే ఇరు రాష్ట్రాలతో సమవేశం ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. అందుకు అనుగుణంగా ఈ నెల 21న సమావేశ తేదీని నిర్ణయించింది. ప్రాజెక్టులను తాత్కాలికంగా బోర్డు నియంత్రణలో ఉంచాలని, నీటి విడుదల, వినియోగం, వాటా మేరకు పంపకం తదితర అంశాలపై బోర్డు పర్యవేక్షణ ఉండాలని తెలంగాణ కోరుతోంది. అయితే దీనిపై ఏపీ ఎలాంటి అభిప్రాయం చెబుతుందన్నది ప్రశ్న. ఒకవేళ మార్పులు కోరితే, తెలంగాణ సైతం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో తెలంగాణకు వచ్చే నీటి వాటాలపై పట్టుబట్టడం ఖాయమని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement