ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటి?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల కేటాయింపు విషయంలో వైఎస్ సర్కార్పై బురద చల్లిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటని శ్రీకాంత్ రెడ్డి సోమవారమిక్కడ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎకరం రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు కట్టబెట్టారని, రాజధాని ప్రాంతంలో బాలకృష్ణ బంధువులకు కోట్ల విలువైన రూ.498 ఎకరాల భూమని తక్కువ ధరకు కేటాయించారన్నారు. రాయలసీమలో గల్లా జయదేవ్‌కు కోట్ల విలువైన భూమిని లక్షలకే కట్టబెట్టారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
'బాబును సూటిగా ప్రశ్నిస్తున్నా.. మా ఆరోపణలపై ధైర్యముంటే చర్చకు రావాలి. లేదా దీనిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి. చంద్రబాబు 18 నెలల పాలనలో 700 చీకటి జీవోలు జారీ చేశారు. పారదర్శక పాలన అంటున్న చంద్రబాబు అవినీతికి గేట్లెత్తారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను చంద్రబాబు ...బంధువులకు కట్టబెడుతున్నారు. వందల కోట్ల విలువైన భూములు తమ వారికి కట్టబెట్టడం సామాజిక న్యాయమా?. చంద్రబాబు లూటీపై బహిరంగ చర్చకు సిద్ధం. ఇరిగేషన్ ప్రాజెక్టులలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని ఎండగడతాం' అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.