హెయిర్ కట్ తెచ్చిన సమస్య
ఇంగ్లండ్లో 11 ఏళ్ల టేలర్ ముచ్చటపడి వెరైటీగా హెయిర్ కట్ చేయించుకున్నాడు. తల వెనుక, పక్కభాగాల్లో చాలా చిన్నగా జుత్తు కత్తిరించుకుని, తల పైభాగంలో మాత్రం కొంచె వెంట్రుకలు కనిపించేలా చేయించుకున్నాడు. గ్రింమ్స్బీలో ఏడో తరగతి చదువుతున్న టేలర్కు ఈ హెయిర్ స్టైల్ సమస్యగా మారింది. స్కూల్ టీచర్లు టేలర్ను తరగతిలోకి అనుమతించలేదు.
టీచర్లు టేలర్ తల్లి సుసాన్ మీడోస్ను స్కూలుకు పిలిపించి మాట్లాడారు. టేలర్ వెంట్రుకలు మరీ చిన్నగా ఉన్నాయని, స్కూలు నిబంధనల ప్రకారం అతని హెయిర్ స్టైల్ సముచితంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. టీచర్ల నిర్ణయంపై సుసాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన కొడుకు ఎలాంటి తప్పుచేయలేదని, టీచర్లు ఇలా శిక్షించడం సరికాదని, వారి ప్రాధాన్యాలు తప్పని చెప్పింది. ఈ హెయిర్ కట్ వల్ల టేలర్ చదువుపై ప్రభావం చూపుతుందని చెప్పారని, అతనికి వచ్చిన సమస‍్య ఏమీ లేదని తెలిపింది.
టేలర్కు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇదే హెయిర్ కట్తో ఉన్నాడని సుసాన్ చెప్పింది. కాగా టీచర్లు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వాపోయింది. స్కూలు డిప్యూటీ ప్రిన్సిపాల్ డారెన్ వుడ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ఒకే యూనిఫాం, ప్రవర్తన నియమాలు పాటించాలని అన్నారు. విద్యార్థులందరిని ఒకేలా చూస్తామని, పాఠశాల నియమాల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.