ఇదేమి బరువురా బాబోయ్!
బీజింగ్: చైనా అనగానే మనకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని గుర్తుకు వస్తుంది. అంతంత మాత్రపు జీతాలపై బతుకు బండి లాగించే కార్మికులు గుర్తొస్తారు. అత్యంత బరువు బండి లాగే బతుకులు కూడా వాళ్లవే. ఒక సైకిల్‌పై నలుగురు, ఒక మోటార్ సైకిల్‌పై ఐదుగురు ప్రయాణించడం అక్కడ నిత్యం కన్పించే దృశ్యాలే. ట్రక్కులపై తీసుకెళ్లాల్సిన సరకులను సైకిల్‌పై లాక్కుపోవడం. వరుసగా మోటారు సైకిల్‌కు ఐదారు వాహనాలను కట్టుకొని తరలించుకుపోవడం, టన్నులకొద్ది బరువుగల భారీ పైపులను రిక్షాలపై లాగించడం, 20 టన్నులకు మించని లోడ్‌ను తీసుకెళ్లాల్సిన వాహనాలపై వంద టన్నుల సరకులను తరలించడం కూడా మామూలే.
చైనాలో దాదాపు 66 లక్షల వంతెనలు ఉన్నాయన్నది ఓ అంచనా. వాటిలో దాదాపు పావు వంతు వంతెనలు అధిక బరువును తీసుకెళ్లే ట్రక్కుల వల్లనే కూలిపోయాయట. హాంగ్‌జౌలోని క్వియాన్‌టాంగ్ నదిపై నిర్మించిన వంతెన కూడా అలాగే కూలింది. ఆ వంతెన సామర్థ్యం ప్రకారం 30 టన్నులకు మించి సరకులను తీసుకెళ్లరాదు. ఓ రోజు 129 టన్నుల బరవును తీసుకెళుతున్న ట్రక్కు వల్ల కూలిపోయిందట. 2004లోనే రోడ్డు భద్రతా నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదట. అందుకే కూలిన వంతెనల చోట కొత్త వంతెనలను కడుతూ పోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతి పొడవైన, బలమైన, అబ్బురపరచే వంతెనలు కడుతున్న చైనాకు ఈ దుస్థితి ఏమిటో మరి!