సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని భారతీయులు మానసికంగా దీటుగా ఎదుర్కొంటారని చైనాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు. కోవిడ్-19ను శారీరకంగా ఎదుర్కొనే వ్యాధినిరోధక శక్తి భారత ప్రజలకు లేకున్నా మానసికంగా దీన్ని తట్టుకునే సామర్థ్యం వారికుందని షాంఘైలోని హుషాన్ ఆస్పత్రి అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ జాంగ్ వెన్‌హాంగ్ అన్నారు. భారత్‌లో ఓ మతానికి సంబంధించిన సమావేశంలో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా పాల్గొనడం తాను మీడియాలో చూశానని, భారతీయులకు కోవిడ్-19ను ఎదుర్కొనే మానసిక సామర్థ్యం మెండుగా ఉందని భారత్‌లో చైనా విద్యార్ధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాంగ్ పేర్కొన్నారు.
చదవండి : అదృశ్యమైన చైనా జర్నలిస్ట్ ప్రత్యక్షం
భారతీయులు ప్రశాంత చిత్తంతో ఉంటారని కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వ వ్యూహాల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న జాంగ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో వైరస్ వ్యాప్తి వేగంగా చోటుచేసుకుంటున్నా అమెరికాలో రోగుల సంఖ్యతో పోలిస్తే అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో అది పరిమితమైనదేనని అన్నారు. ఇన్ఫెక్షన్ రేటు భారత్‌లో తకక్కువగా ఉందని, భారత్‌లో వైరస్ సోకే వారి సంఖ్య 10 శాతానికి మించదని, మీ చుట్టూ ఉండే వారిలో 90 శాతం మంది వైరస్ జాడలేని వారేనని చైనా విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. భారత్‌లో ఇప్పటివరకూ కోవిడ్-19 బారినపడిన వారి సంఖ్య 25,000 దాటగా 718 మంది మరణించారు. 4719 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 27,08,470 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,90,788 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment