![Chinese Media Says New Chopper Drone May Deployed Along India Border - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/25/china%20%281%29.jpg.webp?itok=Fw6hRzG6)
బీజింగ్: కొత్తగా అభివృద్ధి చేసిన హెలికాప్టర్ డ్రోన్‌ను భారత్ సరిహద్దులో మోహరించనున్నట్లు చైనా అధికార మీడియా పేర్కొంది. భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ 15 వేల అడుగుల ఎత్తులో నుంచి లక్ష్యంపై అగ్ని గోళాలు కురిపించగల సామర్థ్యం గల ఏఆర్500సీని బలగాలు రంగంలోకి దింపినట్లు గ్లోబల్ టైమ్స్ సోమవారం కథనం వెలువరించింది. చైనా భూభాగంలోని గల్వాన్ ప్రాంతంలో భారత్ రక్షణ దళాల అవసరాల నిమిత్తం చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఈ హెలికాప్టర్‌ను మోహరించినట్లు తెలిపింది. సిక్కిం, లఢక్ సెక్టార్ల వెంబడి భారత్ దూకుడు చర్యలకు సమాధానం చెప్పేందుకే ఈ చర్యకు పూనుకున్నట్లు వెల్లడించింది. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా)
కాగా తూర్పు లఢక్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది ఘర్షణకు దిగి.. పరస్పరం రాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లఢక్‌లోకి చైనా మిలిటరీ హెలికాప్టర్ చొరబాటు యత్నాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై స్పందించిన భారత్ విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. వాస్తవాధీన రేఖ వెంబడి నిబంధనలను అనుసరించి భారత దళాలు గస్తీ కాస్తున్నాయని స్పష్టం చేశారు. చైనా కావాలనే తమ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.పరిస్థితులును పర్యవేక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ ఎమ్ నరవనె శుక్రవారం లేహ్‌ను సందర్శించారు.(భారత జవాన్లను నిర్బంధించిన చైనా, ఆపై)
Comments
Please login to add a commentAdd a comment