చిన్నసైజు రోబోతో కొలనోస్కోపీ పరీక్ష
వాషింగ్టన్: కొలనోస్కోపీ (పెద్దపేగు పరీక్ష)ని సౌకర్యవంతంగా చేసేందుకుగాను శాస్త్రవేత్తలు క్యాప్సూల్ సైజ్‌లో ఉండే రోబో పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్యాప్సూల్ రోబోను బయటి నుంచి రోబోటిక్ ఆర్మ్‌కు జతచేసిన అయస్కాంతం సహాయంతో పేగులోకి వెళ్లేలా చేస్తారు. ఇప్పటివరకు కొలనోస్కోపీ పరీక్షలో రోగులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యం తమ 18 మిల్లీ్లమీటర్ల సైజు క్యాప్సూల్ రోబోతో తొలగుతుందని వారు వెల్లడించారు.
పెద్దపేగులో కేన్సర్ కారకాలు, కణితులు ఇతర వ్యాధుల తాలూకు లక్షణాలను గుర్తించేందుకు కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. అయితే ఈ పరీక్ష చేసే విధానం నొప్పితో కూడుకున్నది కావడంతో చాలామంది పరీక్ష చేయించుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తారని అమెరికాలోని వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కీత్ అబ్‌స్టయిన్ తెలిపారు. ఈ క్యాప్సూల్‌ను ఉపయోగించి పందులపై చేసిన ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు ప్రకటించారు. దీంతో 2018 చివరి నాటికి మనుషులపై దీన్ని ప్రయోగిస్తామని వెల్లడించారు.