కసి తీర్చుకున్నఊరకుక్కలు!
బీజింగ్: ఛీ... ఊరకుక్కంటూ చులకనగా చూడవద్దు. కోపంతో తన్ని తగిలేయొద్దు. వాటికి కూడా రోషముంటుంది. అలా చేసిన ఓ చైనా కుర్రాడికి ఊరకుక్కలు కలిసికట్టుగా తగిన గుణపాఠం చెప్పాయి. చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఇటీవల ఓ కుర్రాడు కారులో షికారుకెళ్లి తన ఇంటి ముందుకొచ్చాడు. తనకిష్టమైన కారు పార్కింగ్ స్థలంలో ఓ ఊరకుక్క కునికిపాట్లు పడుతూ కనిపించింది. హారన్ కొట్టినా అది అక్కడి నుంచి కదలలేదు. దీనికింత పొగరా ! అంటూ కారు దిగిన ఓ కుర్రాడు దాన్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఆ కుక్క కుయ్...మనకుండా చురచురా చూపులతో అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ ఊరకుక్క తన మిత్రులతో అక్కడికి కలిసొచ్చి కుర్రాడి కారుపై దాడికి దిగింది.
ముందటి చక్రం పైభాగానుండే కారు రేకును కసిదీర కొరికి ధ్వంసం చేసింది. ఇక దాని మిత్రులు తమవంతు సహకారంగా కారు అవతలి టైరును పాడు చేయడమే కాకుండా కారద్దం వైపర్స్‌ను కొరికి ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఎప్పటికో ఇంటి నుంచి బయటకొచ్చిన ఆ కుర్రాడు తన కారును చూసుకొని కుయ్యో...మొర్రో...అన్నాడు. కుక్కల దాడిని తన సెల్ కెమేరాలో షూట్ చేసిన పక్కింటాయన వచ్చి జరిగినదంతా చూపించాడు. ఊరకుక్కల వల్ల బీమా కంపెనీల నుంచి నష్ట పరిహారం కూడా రాద ంటూ ఆ కుర్రాడు బిక్కమొహం వేయక తప్పలేదు. చైనాలో ఊరకుక్కల గొడవెక్కువే. వాటిని హింసించినా, అవి కరిచినా బాధితులకు నష్ట పరిహారం చెల్లించే చట్టాలేవీ అక్కడ లేవు. లెసైన్స్‌డ్ కుక్కల నుంచి నష్టం జరిగితేనే వాటి యజమానుల నుంచి మాత్రం పరిహారం ఇప్పిస్తారు.