బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో కొత్త మందు
న్యూయార్క్: మెదడులో కణితిలు వ్యాపించకుండా సమర్థవంతంగా నిరోధించే కొత్త ఔషధం పీపీఎఫ్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మెదడు కణాలలోని టీఆర్ఓవై అనే ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకొని ఈ మందు పనిచేస్తుంది. ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో పీపీఎఫ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రాన్సిషనల్ జినోమిక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మెదడులోని క్యాన్సర్కు గురైన గ్లియోబ్లాస్టోమా కణాలలోని ప్రొటీన్లను నశింపచేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో వాడే కీమోథెరపీతో పాటు రేడియోథెరపి విధానాలకు ఈ ఔషధం సహాయకారిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనకు సంబంధించిన వివరాలను సీనియర్ రచయిత నెహన్ ట్రాన్ వెల్లడిస్తూ.. క్యాన్సర్ కణాలను నిస్సహాయంగా మార్చడంలో పీపీఎఫ్ ఔషధం విజయవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మెదడులోని క్యాన్సర్ బారిన పడిన కణాలు వ్యాపించకుండా పీపీఎఫ్ పనిచేయడం వలన చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.