బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ విమానాన్ని పరీక్షించిన ఆస్ట్రేలియా
సాక్షి, వెబ్ డెస్క్ : సంప్రదాయ పద్ధతులు, వస్తువులకు కాలం చెల్లింది. ప్రతీ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ కుర్చీలు, ఎలక్ట్రిక్ స్టవ్‌లు మొదలుకొని రోడ్డుపై తిరిగే కార్ల వరకు మొత్తమంతా ఎలక్ట్రిక్ మయమవుతున్న ఈ గ్లోబల్ యుగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు ఆస్ట్రేలియా వేదిక కానుంది.
యుగోస్లేవియాకు చెందిన విమాన తయారీ సంస్థ ‘పిప్‌స్ట్రెల్’ సాయంతో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ఎలక్ట్రోఏరో’ ఎలక్ట్రిక్ విమానాల తయారీకి శ్రీకారం చుట్టింది. స్వల్ప దూరాన్ని ప్రయాణించేందుకు వీలుగా ఐదుగురిని మోయగల బుల్లి ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించింది. పెర్త్ విమానశ్రయంలో దాని పనితీరును పరిశీలించింది.
పిప్‌స్ట్రెల్ అల్ఫా ఎలక్ట్రో.. ది ఎయిర్‌క్రాప్ట్
ఈ విమానం లిథియం అయాన్ బ్యాటరీతో పని చేస్తుంది. ఒక బ్యాటరీ వెయ్యి సార్లు ఎగిరేందుకు అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గంట సమయంలో బ్యాటరీ ఫుల్‌చార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం జండకోట్ విమానాశ్రయంలో సూపర్ చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఖర్చు కూడా తక్కువే..
ఈ ఎలక్ట్రిక్ విమానం గంట పాటు ఎగిరేందుకు అయ్యే ఖర్చు కేవలం మూడు డాలర్లే. టేకాఫ్ అయ్యేందుకు 60 కిలోవాట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతోంది. సంప్రదాయ విమానాలతో పోల్చితే ఇది చాలా చవక.
కాలుష్య నివారణ దిశగా అడుగులు..
ప్రపంచమంతటా గల దాదాపు 20 వేల విమానాలు వెదజల్లే కార్బన్ ఉద్గారాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇంధనాన్ని పొదుపు చేస్తూ, తక్కువ ఖర్చుతో ఎగరగల విమానాల్ని తయారుచేస్తూ పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న పిప్‌స్ట్రెల్, ఎలక్ట్రోఏరోల ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment