టాప్-10 కుబేరుల్లో జుకర్ బర్గ్
మార్కెట్ల పతనం, చమురు ధరలు పడిపోవడం ప్రపంచ ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపింది. చాలా మంది కుబేరుల సంపద విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 2009 నుంచి తొలిసారి 10 మంది స్థానం కోల్పోయారు. ఇక ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ సారి 221 మంది స్థానం కోల్పోగా, కొత్తగా 198 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయలు తగ్గింది.
ప్రపంచ అత్యంత కుబేరుల తాజా జాబితాలో బిల్ గేట్స్ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద విలువ 5.08 లక్షల కోట్ల రూపాయలు. కాగా గతేడాదితో పోలిస్తే ఆయన సంపద విలువ దాదాపు 28 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. యూరప్కు చెందిన జారా అమానికో ఓర్టెగా రెండో స్థానానికి దూసుకెళ్లారు. ఆయన ఈ స్థానానికి రావడం ఇదే మొదటి సారి. వారెన్ బఫెట్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంతకుముందు 2వ స్థానంలో ఉన్న మెక్సికో వాసి కార్లోస్ స్లిమ్ 4వ స్థానానికి పడిపోయారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ 16వ స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి ఎదిగారు. జుకర్ బర్గ్తో పాటు అమేజాన్ సీఈవో జెఫ్ బిజోస్ తొలిసారి టాప్-10లో స్థానం సంపాదించారు. చైనాకు చెందిన వాంగ్ జియాన్లిన్ తొలిసారి టాప్-20లో చేరారు.