ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద నగరం లాగోస్. వచ్చిపోయే భారీ నౌకలు, వాటిలో నుంచి సరుకులు దింపే వేలాది కార్మికులతో లాగోస్ షిప్పింగ్ యార్డ్ నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ పనిచేసే కార్మికుల్లో చాలామందివి 'టీ విత్ బన్' జీవితాలే! ప్రతిరోజు మధ్యాహ్నం.. ప్లాస్టిక్ కవర్ లో కుప్పలా పేర్చిన బ్రెడ్డు ముక్కల్సి కనెత్తిమీద పెట్టుకుని షిప్పింగ్ యార్డుకు వస్తుంది పాతికేళ్ల జుమోకె. చేతులతో డబ్బులిస్తూ చూపులతో రకరకాల భావాలు పలికించే ఆ కూలీలతో వీలైనన్ని ఎక్కువ రొట్టెముక్క(బ్రెడ్)లు కొనిపించేందుకు ప్రయత్నిస్తుందామె.
ఒక రోజు పనిమీద అటుగా వెళ్లినా టివై బెలో.. నెత్తిమీద బ్రెడ్ తో నడుస్తున్న జుమోకెను ఫొటో తీసింది. ఆ క్షణంలో.. ఆ క్లిక్ తన జీవితాన్న మార్చబోతోందని ఊహించని జుమోకె నవ్వుతూ ఫొటోకి ఫోజిచ్చింది. ఫొటో తీసిన టివై కూడా తక్కువదేమీకాదు. చిన్నవయసులోనే ప్రొపెషనల్ ఫొటోగ్రాఫర్ గా, సాంగ్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అలా సరదాగా తీసిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 'వావ్.. ఎవరీ మోడల్? ఎంత నేచురల్ గా స్టిల్ ఇచ్చింది..!' అంటూ పొగడ్తలు కురిశాయి. నాలుగైదు యాడ్ ఏజెన్సీలు టివైకి ఫోన్ చేసి ఆ మోడల్ ను తమ ప్రకటనల్లో నటింపజేయాలని విజ్ఞప్తిచేశారు. టివై మరోసారి సముద్రతీరానికి వెళ్లి జమోకెతో మాట్లాడింది. అన్నీ వివరించి మోడలింగ్ కు ఒప్పించింది. కట్ చేస్తే..
జమోకె ఇప్పుడు నైజీరాయాలోని టాప్ మోడల్స్ లో ఒకరు. ఫొటో షూట్లని, ర్యాంప్ వాక్ లని క్షణం తీరికలేనంత బిజీ. పూటగడిపేందుకు కష్టాలు పడ్డ ఆమెకు ప్రస్తుతం చేతినిండా సంపాదన. పూల కీరిటం పెట్టుకుని ఫొటోల్లో మెరిపోయినప్పటికీ.. రొట్టెలమ్ముకుని బతికిన రోజుల్ని ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకుంటుంది. జుమోకె జీవితగాథ ను చదివిన ఎంతోమంది ఆమె నుంచి స్ఫూర్తి పొందారు. ఓ జాతీయ బ్యాంకు ఆమె పిల్లలిద్దరినీ చదివించేందుకు ముందుకొచ్చింది. భర్త పిల్లాలతో ఇప్పుడామె సంసారం హాయిగా సాగిపోతోంది. అవకాశమంటూ రావాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరంటోంది జుమోకె.
ఒక ఫొటో ఆమె జీవితాన్ని మార్చేసింది!
Published Sat, Mar 12 2016 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement
Advertisement