లండన్ : వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లితే.. అక్కడి వైద్యులు రోగులు చెప్పేది(అనారోగ్యం గురించి) ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలియజేస్తూ లండన్‌కు చెందిన ఓ సంస్థ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం భారతదేశంలో సగటున ఓ రోగిని వైద్యుడు కేవలం రెండే రెండు నిమిషాలు మాత్రమే పరిశీలిస్తున్నారంట(కన్సల్టేషన్ టైం).
ఈ విషయాన్ని బ్రిటీష్ మోడల్ జర్నల్‌కు చెందిన బీఎంజే ఓపెన్ సంస్థ పరిశోధన చేసి నివేదికను విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ, ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇలా వైద్యం అందించటం మూలంగానే వారి ప్రాణాలు ముప్పు బారిన పడుతున్నాయంట. వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. ఓవైపు వ్యాపార ధృక్పథం పెరిగిపోవటం.. మరోవైపు వైద్యులపై ఒత్తిడి ఇందుకు కారణాలు అవుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
అయితే ఆ ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఎక్కువగా ఉందని చెబుతున్నారు న్యూఢిల్లీలోని ఆకాశ్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిశ్ చక్రవర్తి. ఒత్తిడి కారణంగానే ప్రభుత్వ వైద్యులు ఇలా తక్కువ సమయం వారిని పరిశీలించాల్సి వస్తుందని చెబుతున్నారు. గరిష్ఠ జనాభా ప్రభుత్వాసుపత్రుల వైద్యం కోసం ఎగబడటం.. వారికి లక్ష్యాలు విధించటం.. ఆ సమయంలో ఒక్క గంట, రెండు గంటల్లోనే వంద మందిని వైద్యులను చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం ఆయన చేశారు. కార్పొరేట్ వైద్య రంగంలో మాత్రం అది సవ్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు.
ఇక కన్సల్టేషన్ సమయం వివిధ దేశాల్లో ఎలా ఉందో పరిశీలిస్తే... స్వీడెన్ లో గరిష్టంగా ఒక వైద్యుడు ఫెషెంట్‌ను 22.5 నిమిషాలపాటు పరిశీలిస్తాడంట. భారత్ లో(2015) 2 నిమిషాలు, మన పొరుగున ఉన్న పాక్‌లో తక్కువగా 1 నిమిషం 79 సెకన్లు, మొత్తం మీద అతి తక్కువగా బంగ్లాదేశ్‌లో కేవలం 48 సెకన్లు మాత్రమే ఓ వైద్యుడు సగటున రోగికి సమయం కేటాయిస్తున్నారని బీఎంజే ఓపెన్ నివేదిక చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment