విచారణలో సూటి ప్రశ్నలతో ముప్పుతిప్పలు
► సెనట్ కమిటీలో సూటి ప్రశ్నలతో చుక్కలు చూపిస్తున్న కమలా హ్యారిస్!
► 2020 డెమొక్రాటిక్ టికెట్ ఖాయమంటున్న అమెరికా మీడియా!
అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై అమెరికా సెనట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలను భారతీయ అమెరికన్ సెనటర్ కమలా దేవి హ్యారిస్ తన పదునైన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెడతోంది. కిందటి వారం డెప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రాసెన్స్టెయిన్, ఈ వారం అటార్నీ జనరల్(అమెరికా న్యాయశాఖ మంత్రిని ఇలా పిలుస్తారు) జెఫ్ సెషన్స్ను సూటిగా జవాబివ్వాలంటూ ఆమె విరుచుకుపడిన తీరు ఎందరినో ఆకట్టుకుంది. అయితే, కమిటీ చైర్మన్ రిచర్డ్ బర్, రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్కెయిన్ సహా తోటి సెనటర్లు కమల ‘దూకుడు’కు అడ్డుతగిలారు. సూటి ప్రశ్నలకు డొంకతిరుగుడు జవాబుల్వికుండా-అవునో, కాదో అని తేల్చిచెప్పాలని కోరిన ఆమె ఇంటరాగేషన్‌కు అడ్డుతగిలారు.
నల్లజాతి జమైకా ఆఫ్రికన్ తండ్రి, భారత మహిళకు పుట్టిన కమలను అక్కడ ఆఫ్రికన్ అమెరికన్ అనే పిలుస్తారు. ఎఫ్‌బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కోమీ సహా ముగ్గురు జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థల అధిపతులు సాక్షులుగా వచ్చి కమిటీ ముందు నిలబడినప్పుడు నిజానిజాలు రాబట్టడానికి ఆమె సూటి ప్రశ్నలతో వారిని బెంబేలెత్తించారు. రాసెన్స్టెయిన్‌ను ప్రశ్నలడుగుతున్నప్పుడు ఆయన కమలతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు మెకెయిన్, ‘‘మిస్టర్ చైర్మన్, వారిని జవాబులు చెప్పనివ్వండి.’’ అంటూ రిచర్డ్ బర్ను కోరగా, బర్, ‘‘సాక్షులకు తగినంత గౌరవం ఇవ్వడమేగాక వారిని వారి పద్ధతిలో సమాధానాలు చెప్పనివ్వాలి’’ అని ఆదేశించారు.
‘రంగు’ జాతి మహిళ అయినందుకే వివక్షా?
మొత్తానికి కమల ప్రశ్నలకు బెదిరి పాలకపక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే జవాబులు ప్రభుత్వ నేతల నుంచి రాకుండా ఆమెను అడ్డుకోవడంలో కమిటీలోని రిపబ్లికన్లు విజయం సాధించారు. అదీగాక ఆమె తెల్లజాతి కాని రెండు వేర్వేరు జాతుల దంపతుల కూతురు కావడం శ్వేత జాతీయులైన రిపబ్లికన్ సెనటర్లు ఆమెను అడ్డగోలుగా అడ్డుకోవడానికి కారణమని అంటున్నారు. అందుకే ఈ కమిటీలోని ఓరెగన్ సీనియర్ డెమొక్రాటిక్ సెనేటర్ రాన్ వైడన్, ‘ కమలా హ్యారిస్ వాస్తవాలు రాబట్టి రికార్డులకెక్కిస్తున్నారు. సాక్షులను నేను గట్టి ప్రశ్నలడిగినప్పుడు చైర్మన్ బర్ నాకు అడ్డుతగలలేదు. కాని కమలను ముందుకు సాగినివ్వలేదు.’ అని ట్వీట్ చేశారు. తన మేని రంగును బలహీనతగా గాక, బలంగా మార్చుకున్న కమల ఆత్మవిశ్వాసం ప్రత్నర్థులకు భయం పుట్టిస్తోంది.
‘లేడీ ఒబామా’ 2020లో డెమొక్రాటిక్ టికెట్కు పోటీపడతారా?
చెన్నయ్ నుంచి రొమ్ము కేన్సర్పై పరిశోధనకు వచ్చిన డాక్టర్ శ్యామలా గోపాలన్, జమైకా నుంచి వచ్చి స్థిరపడిన ఆఫ్రికన్ అమెరికన్, ఎకనామిక్స్ ప్రొఫెసర్ డొనాల్డ్ హ్యారిస్‌కు కాలిఫోర్నియాలో జన్మించిన 52 ఏళ్ల కమల లా చదవి వృత్తిలో రాణించారు. మొదట శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా ప్రభుత్వ పదవి చేపట్టారు. 2010లో కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్‌గా ఎన్నికై ఆరేళ్లు పదవిలో కొనసాగారు. 2016 నవంబర్ ఎన్నికల్లో తొలిసారి సెనట్‌కు ఎన్నికయ్యారు. కొత్త సెనటర్‌గా ఆరు నెలలు కూడా నిండకుండానే సంచలనాలు సృష్టిస్తున్నారు.
కమల పార్టీకే చెందిన బరాక్ ఒబామా ఒక్కసారే సెనట్ సభ్యునిగా చేసి అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నట్టే ఆమె కూడా 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ టికెట్ సంపాదించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల వయసులో కాలిఫోర్నియా లాయర్ డగ్లస్ ఎమ్హాఫ్ను పెళ్లాడిన కమలను లేడీ ఒబామా అని కూడా పిలుస్తారు. 2013లో కమలను ‘బెస్ట్ లుకింగ్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్’ అని అధ్యక్షుడు ఒబామా ప్రశంసించడం కూడా సంచలనమైంది. జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది మాసాలకే నిజాయితీ, పట్టుదలతో దేశ ప్రజలందరి దృష్టిలో పడిన కమలను కాబోయే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా, అమెరికా రాజకీయాల భవితగా మీడియా అప్పుడే కీర్తించడం విశేషం.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)