నరక లోకపు వారసులు ఈ ఐసిస్‌ తీవ్ర వాదులు | isis terrorists killing yazidi | Sakshi
Sakshi News home page

నరక లోకపు వారసులు ఈ ఐసిస్‌ తీవ్ర వాదులు

Published Wed, Jun 28 2017 7:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

నరక లోకపు వారసులు ఈ ఐసిస్‌ తీవ్ర వాదులు

నరక లోకపు వారసులు ఈ ఐసిస్‌ తీవ్ర వాదులు

కన్న కొడుకు మాంసం వండి తల్లికి చెప్పకుండా తినిపించారు ఇరాక్‌లోని ఐసిస్‌ ముష్కరులు. తాను తిన్నది తన ఏడాది బిడ్డ మాంసంతో చేసిన కూరని ఆ తల్లికి ఐసిస్ ఉగ్రవాదులే చెప్పారు. ఇంతకీ ఆమె చేసిన పాపం క్రైస్తవ, ఇస్లాం, జొరాస్ట్రియన్‌ మతాల విశ్వాసాలు కొన్ని కలిపి భిన్న సంప్రదాయాలతో జీవించే యజీదీ జాతిలో జన్మించడమే. సున్నీ ముస్లిం ఛాందసవాదులమని చెప్పుకునే ఐసిస్ ఉగ్రవాదులు మాత్రం యజీదీలను దెయ్యాలను పూజించే జాతిగా పరిగణిస్తారు. వాయవ్య ఇరాక్, వాయవ్య సిరియా, నైరుతి టర్కీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాకవర్గమే యజీదీలు. ఇరాక్‌ భూభాగం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల చేతుల్లోకి రావడంతో కుర్దుల మాదిరి అనేక పొరుగు దేశాల్లో చెల్లాచెదురై ఉన్న యజీదీల జీవితం నరకప్రాయంగా మారింది. ఐసిస్ 2014 ఆగస్ట్‌ నెలలోని కొన్ని రోజుల్లో దాదాపు పది వేల మంది యజీదీలను చంపడమో లేదా బంధించడమో చేసిందని ‘ప్లాస్మెడిసిన్’ అనే వారపత్రిక వెల్లడించింది. అన్ని దేశాల్లో కలిపి యజీదీల జనాభా ఐదు లక్షల వరకూ ఉంటుందని అంచనా.

నాలుగు లక్షల యాజిదీలకు నరకం!
వాయువ్య ఇరాక్‌లోని మౌంట్‌ సింజార్‌ చుట్టుపక్కల ప్రాంతంలో జీవించే దాదాపు నాలుగు లక్షల మంది యజీదీలు 2014 ఆగస్ట్‌ 3న ఐసిస్‌ జరిపిన దాడిలో కోలుకోలేనంతగా నష్టపోయారు. తరతరాలుగా స్థిరపడిన ఈ ప్రాంతం నుంచి దూరప్రాంతాలకు పారిపోవాల్సివచ్చింది. పారిపోలేని యజీదీలను సున్నీ తీవ్రవాదులు చిత్రహింసలు పెట్టి చంపారు. పట్టుబడిన మహిళలను హింసించి అత్యాచారం చేసి చంపారు. పదేళ్ల ఆడపిల్లలు సైతం లైంగిక హింసకు బలై ప్రాణాలు కోల్పోయారు. యజీదీ యువతులను వేలంవేసి అమ్మేశారు. మత మార్పిడీ అనే సంప్రదాయమే లేని యజీదీలు కొందరిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ దాడి ఫలితంగా మౌంట్‌ సింజార్‌ ప్రాంతానికి పారిపోయిన యజీదీల కష్టాలు వర్ణనాతీతం. ఐసిస్‌ సాయుధులు దిగ్బంధనం ఫలితంగా కొన్ని రోజులు వేలాది మంది యజీదీలు 50 డిగ్రీల ఉష్టోగ్రత మధ్య నీరు, తిండి లేకుండా అక్కడే నిలిచిపోయారు. అమెరికా సేనల సాయం, ఆహార పొట్లాల జారవేతతో కొందరు ప్రాణాలు నిలుపుకున్నారు. చివరికి తమ మాదిరి పలు దేశాల్లో చెల్లాచెదురై ఉన్న మైనారిటీ వర్గమైన కుర్దుల సాయంతో వారం తర్వాత సిరియా, ఇరాక్‌లోని కుర్దుస్థాన్‌ ప్రాంతాలకు క్షేమంగా చేరుకోగలిగారు.

మత విశ్వాసాలే యాజిదీలకు శాపాలయ్యాయి!
పశ్చిమాసియాలోని మూడు ప్రధాన ఏకేశ్వరవాద మతాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని భిన్న మార్గంలో జీవించే యజీదీల మతంలోకి మారడానికి అవకాశం లేదు. మరి స్థానిక సంప్రాదాయ మతాలకు భిన్నమైన జీవన శైలి ఉన్న యజీదీలపై కక్షగట్టిన ఐసిస్ ఉగ్రవాదులు ఇస్లాం బోధనలకు భిన్నంగా వారిని చిత్రహింసలకు గురిచేశారు. యజీదీల 93శాతం హత్యలు మౌంట్‌ సింజార్‌లోనే జరిగాయి. తప్పించుకోవడానికి వీలులేని రోజుల్లో స్త్రీలు, పిల్లలే ఇస్లామిక్‌ స్టేట్‌ రాక్షసత్వానికి బలయ్యారు. టీనేజి యజీదీ పిల్లలను బలవంతంగా మతం మార్చి ఐసిస్‌ బాల సైనికులుగా చేశారని లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఇకనామిక్స్ (ఎలెస్యీ) పరిశోధకుడు డా.వాలరియా చెటోరిలి వెల్లడించారు. మతహీనులైన యజీదీలను పూర్తిగా నిర్మూలిస్తామని మూడేళ్ల క్రితమే ఐసిస్‌ తన ఇంగ్లిష్‌ పత్రిక ‘దబీక్’లో హెచ్చరించింది.


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement