ఎగిరే.. మనసే ఎగిరే...
ఎగిరే కారు వచ్చేస్తోంది... వచ్చేస్తోంది..! ఇలాంటి వార్తలు ఇప్పటివరకూ చాలా చూసే ఉంటాం. కానీ... ఇది మాత్రం చిట్టచివరిది కావచ్చు. ఎందుకంటే.. సాంకేతికంగా, భద్రతా పరంగా అన్ని రకాల అనుమతులు సాధించి తొట్టతొలి ఎగిరే కారుగా రికార్డు సృష్టించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ పీఏఎల్–వీ సిద్ధమైంది! ఫొటోల్లో కనిపిస్తున్నవి వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చే పీఏఎల్–వీ లిబర్టీ ఎగిరే కారు మోడళ్లు! ఇప్పుడు వీటి ప్రత్యేకతలేమిటో చూద్దాం. వీటిలో గాల్లో ఎగిరేందుకు, రోడ్డుపై పరుగులు పెట్టేందుకు రెండు ప్రత్యేకమైన రోటాక్స్ ఇంజిన్స్ ఉంటాయి.
సాధారణ కారు సైజులోనే ఇవి ఉన్నా ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రొపెల్లర్లు కారు బాడీలోకి ఒదిగిపోతాయి. చిన్న మీట నొక్కగానే విచ్చుకుని అయిదు నిమిషాల వ్యవధిలో కారు ఎగిరేందుకు సాయపడతాయి. దాదాపు ఆరు అడుగుల ఎత్తుండే ఈ కార్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకసారి ఇంధనం నింపుకుంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇంతే ఇంధనంతో 1,315 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ ఎగిరే కారు రెండు మోడళ్లలో లభ్యమవుతోంది. పయనీర్ ఎడిషన్ పేరుతో వచ్చే మోడల్‌లో కొనేవాడి ఇష్టం మేరకు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ మోడల్ ఖరీదు దాదాపు రూ.5 కోట్లు. ఇలాంటి హంగులేవీ లేని రెండో మోడల్ రూ.3 కోట్ల వరకూ ఖరీదు చేస్తుంది. అయితే ఈ మోడల్‌ను కొనుక్కునేందుకు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఎగిరే కార్లను ఎక్కడపడితే అక్కడ వాడే అవకాశం లేదు. తగిన నిబంధనలు రూపొందిస్తే భవిష్యత్తులో హైవే నుంచి ఉన్నట్టుండి పైకి ఎగిరి గాల్లో దూసుకెళ్లే కార్లను చూడవచ్చునేమో. – సాక్షి నాలెడ్జ్ సెంటర్