లఖ్వీ విడుదలకు పాక్ కోర్టు ఆదేశం
- పాక్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ నిరసన
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మాన్ లఖ్వీని వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణ కింద లఖ్వీని నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుబట్టింది. రావల్పిండి జైల్లో ఉన్న లఖ్వీ... కోర్టు ఆదేశాలపై శనివారం విడుదలయ్యే అవకాశముంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. లఖ్వీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలను పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదని ఆగ్రహించింది. అతన్ని విడుదల చేయడం ప్రమాదకరమని హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ అన్నారు.
భారత విదేశాంగ కార్యదర్శి అనిల్ వాధ్వా(తూర్పు) ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. ముంబై దాడుల కేసులో లఖ్వీకి పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు డిసెంబర్‌లో బెయిలివ్వడం తెలిసిందే. దీన్ని భారత్ వ్యతిరేకించడంతో శాంతి భద్రతల పరిరక్షణ కింద పాక్ ప్రభుత్వం అతడిని నిర్బంధించింది.
లఖ్వీ పైకోర్టులో సవాలు చేయగా... విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.లఖ్వీని విడుదల చేసిన అధికారులు.. వెంటనే అదే చట్టం కింద మరోమారునిర్బంధించారు. కాగా, సంఝౌతా రైల్లో పేలుడు కేసు విచారణలో జాప్యం జరుగుం తోందని పాక్ సర్కారు ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించు కుని నిరసన తెలిపింది.