దుబాయ్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
దుబాయ్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
Published Sat, Jan 14 2017 5:18 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
దుబాయ్: దుబాయ్లోని తెలుగు వారందరికీ సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చేసింది. వేవ్ రెసోనెన్సు ఈవెంట్స్ సంస్థ ఇక్కడి తెలుగు వారందరికోసం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరపటం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా షార్జాలో మరుబెల్లా రిసార్ట్లో ఈ వేడుకలని ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తెలుగు వారంతా ఈ వేడుకకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలంతా సంప్రదాయ వస్త్రాధారణతో ఇండియాలో జరుపుకునే పద్ధతులకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
గృహిణులకు ముగ్గుల పోటీలు, పిల్లలకి డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. మగవారంతా ఫ్యాషన్ వాక్, డాన్సులతో అదరగొట్టారు. ఇటీవల ప్రవాసీ మిత్ర అవార్డు అందుకున్న శ్రీ తులసి ప్రసాద్, మాగల్ఫ్.కామ్ నిర్వాహకులు శ్రీకాంత్ని తెలుగు వారంతా అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న వారి పేర్లను లక్కీ డిప్ తీయగా ఇండియాకి తిరుగు ప్రయాణ టికెట్ను షార్జాకి చెందిన ప్రియా శ్రీరామ్ గెలుచుకున్నారు. ఉదయం 10. 30 నిమిషాలకి ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగాయి.
చివర్లో తంబోలా నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ప్రముఖ సంఘసేవకురాలు ఉమా పద్మనాభం కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించారు. ఈ సంవత్సరంతో వేవ్ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 28 న పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహించనున్నట్లు వేవ్ వ్యవస్థాపకులు శ్రీ గీతా రమేష్ తెలిపారు. దుబాయ్లో ఇలాంటి వేడుకల్ని నిర్వహించటానికి ప్రభుత్వం నుండి ఆయా సంస్థకి అనుమతి తప్పని సరి. తెలుగు సంస్థల్లో ఆ అనుమతి కలిగిన ఏకైన సంస్థ వేవ్ అని సంస్థ అధినేత రమేష్ బాబు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని తెలుగువారి వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని సుధా విజయకుమార్ , ప్రశాంతి , రమేష్ లు తమ వ్యాఖ్యానంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు. కోడి పందాలు, గంగిరెద్దులు ఉంటే కనుక ఇక ఈ పండక్కి ఇండియా వెళ్లనవసరం లేదు అని అతిథులంతా ఛలోక్తులు విసురుకున్నారు. ఈ వేడుకకి చెన్నైకి చెందిన ఆర్ఎంకే కన్స్స్ట్రక్షన్ స్పాన్సర్ చేసింది.
Advertisement
Advertisement