ఫ్రెంచి రాజకీయాల్లోకి మళ్లీ సర్కోజీ!
ప్లేబోయ్గా ప్రసిద్ధి చెందిన ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. మరోసారి ఫ్రాన్సుకు అధ్యక్షుడిని అవుదామని ఆయన ఆశపడుతున్నారు. తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో అంతర్జాతీయ మోడల్ కార్లా బ్రూనీతో సరసాలు.. ఆ తర్వాత పెళ్లి లాంటి విషయాలతో మీడియాలో ఎప్పుడూ నానుతూ వచ్చిన సర్కోజీ ఇప్పుడు మరోసారి సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నారు. యూనియన్ ఫర్ ఎ పాపులర్ మూవ్మెంట్ (యూఎంపీ) తరఫున ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్నారు.
అయితే.. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా సర్కోజీ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడగలనని సర్కోజీ ఇప్పుడు ఆశిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు హోలండ్కు మరోసారి అవకాశం వచ్చేలా మాత్రం లేదు. కేవలం 13 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ పోటీ పడాలని అనుకుంటున్నారు. ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికలు 2017లో జరగనున్నాయి.