ముక్కు మూసుకుని 15 నిమిషాలు!
మహాభారత యుద్ధం తర్వాత దుర్యోధనుడు ఎక్కడ దాక్కున్నాడు? ఓ నీటి సరస్సు అడుగుభాగంలో ఊపిరి పీల్చకుండా కొన్ని రోజులు గడిపేశాడు. అవన్నీ కథలు. వాస్తవంగా అయ్యేవా.. పొయ్యేవా? అనుకుంటున్నారా? అయితే రోజుల తరబడి కాకున్నా కనీసం 15 నిమిషాలపాటు అయినా ముక్కుమూసుకుని నీటిలో నిక్షేపంగా బతికేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు కిటుకేమిటంటే.. ఆక్సిజన్ అణువులను రక్తంలోకి ఎక్కించడమే!
మనిషి వెంట్రుకలు సగటున 80 మైక్రోమీటర్ల మందం ఉంటాయనుకుంటే.. వాటిలో 40వ వంతు సైజులో.. అంటే రెండు నుంచి నాలుగు మైక్రోమీటర్ల సైజున్న ఆక్సిజన్ అణువులను లిపిడ్ కవచాల సాయంతో రక్తంలోకి ఎక్కించడం ద్వారా దీనిని సాధించవచ్చని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధన బృందం సారథి జాన్ కెయిర్ అంటున్నారు. రక్తంలోకి చేరిన లిపిడ్ కవచాలు ఎర్ర రక్తకణాలను ఢీకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని, తద్వారా శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందుతుందని కెయిర్ తెలిపారు. ప్రమాదాల్లో, లేదా యుద్ధాల్లో గాయపడ్డ వారు గాయాలతోనే కొంచెం ఎక్కువ సేపు బతికేలా చేయవచ్చని, తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.