అమెరికాలో అదే పనిగా... | U.S. mobile users check Facebook's app several times a day | Sakshi
Sakshi News home page

అమెరికాలో అదే పనిగా...

Published Fri, Oct 6 2017 8:06 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

U.S. mobile users check Facebook's app several times a day - Sakshi

సాక్షి, హైదరాబాద్ : సాయంత్రం వేళ ఏ ఇద్దరు కలిసినా కాసేపు కబుర్లు చెప్పుకునే సందర్భాలు రానున్న కాలంలో ఉండవేమో. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వాటిల్లో ఏదో ఒక మీడియాకు అలవాటు పడిపోతున్నారు. ప్రత్యేకించి ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో వేదికలు. ఎన్నెన్నో వింతలు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వాడకం విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వాడుతున్నారు. కొత్త స్నేహితులను వెతుక్కోవడం, బంధాలు, సంబంధాలు తెగిపోయిన వారిని కలుపుకోవడం, ప్రపంచ నలుమూలల్లో జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తెలుసుకోవడం, ఆయా విషయాలపై స్పందించడం, తమ అనుభావాలను ఇతరులతో పంచుకోవడం...  ఇలా అనేక రకాలుగా ప్రజలు సోషల్ మీడియా వేదికలపై ఆధారపడుతున్నారు.

సోషల్ మీడియా - ప్రపంచంలోనే ప్రజలందరికీ ఒక వ్యసనంలా మారిన ఈరోజుల్లో మార్కెట్ రీసెర్చ్ రంగంలో ఉన్న ' ఆడియన్స్ ప్రాజెక్ట్ ' సంస్థ ఒక అధ్యయనం జరిపింది. సోషల్ మీడియా, యాప్స్ వినియోగంపై జరిపిన అధ్యయనంపై ఇన్ సైట్ - 2017 పేరుతో నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా అమెరికా, యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్ ల్యాండ్ లాంటి ఆరు దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు (సాక్షి స్పెషల్) వెల్లడయ్యాయి. భారత దేశంలో అయితే రోజుకు సగటున ఒకసారి ఫేస్ బుక్ పేజీ తెరిచి చదువుతారట.

కొందరు నాలుగైదుసార్లు, మరికొందరు రెండుమూడుసార్లు తెరిచే వారి జాబితాలో ఉండొచ్చు. అదే అమెరికాలో.. ఒక రోజులో ఒకటి రెండుసార్లు కాదు... అనేకసార్లు ఫేస్ బుక్ చూసుకుంటారట. ఫేస్ బుక్ చూడందే వారికి గడవదు. అమెరికాలో మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో సగానికిపైగా ఫేస్ బుక్ ను ప్రతి రోజూ అనేకసార్లు ఓపెన్ చేసుకుని చూస్తారని ఆడియన్స్ ప్రాజెక్టు తన నివేదకలో వెల్లడించింది. ఫేస్ బుక్ చూడలేదంటే వారెంతో వెనుకబడిపోయినట్టుగానే భావిస్తున్నారట. సాధారణంగా తమ ఫోన్ లో ఒకటి నుంచి మూడు యాప్స్ (ఫోన్ ఇన్ బిల్ట్ ఉన్న యాప్స్ కాకుండా) డౌన్ లోడ్ చేసుకుంటారు. కానీ అమెరికాలో యాప్స్ డౌన్ లోడు చేసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువేనట.

అమెరికాలోని మొబైల్ వినియోగదారుల్లో సగానికిపైగా ప్రజలు ఒక రోజులో అనేకసార్లు ఫేస్ బుక్ ను ఓపెన్ చేసేవారు 53 శాతం ఉన్నారు. 24 శాతం ప్రతిరోజూ ఓపెన్ చేస్తారు. 12 శాతం ప్రజలు వారంలో
అనేకసార్లు, 5 శాతం నెలలో అనేకసార్లు, 3 శాతం నెలకోసారి ఓపెన్ చేసుకుంటారట. 2 శాతం వినియోగదారులు ఎప్పుడోగాని ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయరట. మొబైల్ వినియోగదారుల్లో ఫేస్ బుక్ పరిచయం లేనివారంటూ ఒక్కరూ లేరు. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టగ్రామ్, పింటెరెస్ట్, స్నాప్ చాట్, లింక్డిన్, వాట్సాప్, టంబ్లర్, రెడిట్, పెరిస్కోప్... ఇలాంటి సోషల్ మీడియా వేదికలు వేటిని పరిశీలించినా అన్నింటిలోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఫేస్ బుక్ పరిశీలించుకునే వారిలో మాత్రం (పురుషులు 76 శాతం) మహిళలు (84 శాతం) ఉన్నారు. చేతిలో మొబైల్ పట్టుకున్నారంటే... చాలు మొట్టమొదట ఫేస్ బుక్ చెక్ చేసుకోవడం ఒక వ్యాపకంగా మారిందట. ఫేస్ బుక్ చూసుకునే వారితో పాటు ఇతర నెట్ వర్కింగ్ యాప్స్ వినియోగదారులు కూడా గణనీయంగా పెరుగుతున్నారు. (సాక్షి స్పెషల్ రిపోర్ట్) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement