ఆన్‌లైన్‌లోనూ సంస్కారం అవసరమే!
- నెట్టింట్లో పెరుగుతున్న దూషణలు, వేధింపులు
- మైక్రోసాఫ్ట్ సివిలిటీ ఇండెక్స్ సర్వేలో వెల్లడి
ఫేస్‌బుక్, ట్వీటర్, మెయిల్‌లతో.. తరచూ దూషణలకు, వేధింపులకు గురవు తున్నారా? సున్నితమైన సమాచారం మీకు తెలియకుండానే నెట్‌లో ప్రత్యక్షమై మీ పరువుకు భంగం కలిగిస్తోందా? ఆన్‌లైన్ ట్రోల్స్‌తో సతమత మవుతున్నారా? అయితే మీరేమీ ఒంటరివారు కాదు. భారత్‌లోని నెట్ యూజర్లలో అత్యధికులు ఈ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని మైక్రోసాఫ్ట్ సివిలిటీ ఇండెక్స్ చెబుతోంది. సురక్షిత ఇంటర్నెట్ దినం (సేఫ్ ఇంటర్నెట్ డే) సందర్భంగా భారత్‌తోసహా మరో 14 దేశాల్లో ఆన్‌లైన్ రిస్క్‌లపై మైక్రోసాఫ్ట్ సర్వే నిర్వహించింది. మనదేశంలో ఆన్‌లైన్ సమస్యలను ఎదుర్కొనే విషయంలో పెద్దవారి కంటే యువకులే ఎక్కువ ఆత్మస్థైర్యంతో ఉన్నట్లు తేలింది. అత్యవసర పరిస్థితుల్లో సాయం ఎక్కడి నుంచి అందుతుందో యువకులకే ఎక్కువ తెలుసని స్పష్టమైంది.
ఆన్‌లైన్‌లో దూషణల పర్వం ఎక్కువవుతున్న తరుణంలో మర్యాద ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆన్‌లైన్ కార్యకలాపాల ప్రతికూల ప్రభావం నిజజీవితంలో కనిపిస్తున్న దాఖలాలు ఉన్న కారణంగా ఇది అత్యంత అవసరమని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఇంటర్నెట్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలపై భారతీయుల్లో అవగాహన తక్కువగానే ఉందని, సమస్య ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చాలామందికి తెలియదని సర్వే చెబుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 77% సైబర్ దబాయింపులు, వేధింపులపై ఆందోళన వ్యక్తం చేయగా.. ఇంతే స్థాయిలో లైంగిక వేధింపులు, అసభ్యకర పదజాలంతో సందేశాలు రావడం లాంటి సమస్యలను ఏకరవు పెట్టారు.