బద్దలుకొట్టినా... రికార్డు దక్కలేదు!
వాషింగ్టన్: అమెరికన్ కంపెనీ హెన్నెస్సీ తయారు చేసిన ఈ కారు పేరు ‘వీనమ్ జీటీ’. గంటకు 435 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి ప్రపంచంలోనే అత్యంత వేగంతో నడిచిన కారుగా రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో గల 5 కి లోమీటర్ల రన్‌వేపై డ్రైవర్ బ్రెయిన్ స్మిత్ దీనిని ఇటీవల పరుగులు పెట్టించాడు. రెండు 927 కిలోవాట్ల టర్బైన్లు, 1,244 హార్స్‌పవ ర్ సామర్థ్యం గల వీ8 ఇంజిన్ ఉన్న ఈ కారును తయారు చేసేందుకు రూ. 8.27 కోట్లు ఖర్చు అయిందట. ఇంతకుముందు ‘బుగాటీ వేరాన్ సూపర్ స్పోర్ట్’ అనే కారు అత్యధిక వేగంగా గంటకు 431 కి.మీ. దూసుకుపోయింది. అయితే బుగాటీ రికార్డును బద్దలుకొట్టినా.. వీనమ్ జీటీకి మాత్రం గిన్నిస్ రికార్డు దక్కలేదు. ఎందుకంటే.. రన్‌వేను ఒకసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు నాసావారు అనుమతించారు. గిన్నిస్ బుక్‌వారేమో.. ఇటునుంచి అటు, అటునుంచి ఇటు, రెండు సార్లు నడిపి రికార్డు బ్రేక్ చేస్తేనేగానీ కొత్త రికార్డును కట్టబెట్టలేమని తేల్చిచెప్పేశారట.