కోటి ఆశలు మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో గడచిన ఆరు నెలల్లో ఇప్పటి దాకా 143 తెలుగు సినిమాలు (94 నేరు చిత్రాలు, 49 అనువాదాలు) విడుదలయ్యాయి. సంఖ్యాపరంగా చూస్తే, ఇది భారీగా కనిపిస్తుంది. గత ఏడాది ఇదే ఆరు నెలల్లో విడుదలైన సినిమాల సంఖ్య (85 స్ట్రెయిట్, 48 డబ్బింగ్. మొత్తం 133 చిత్రాలు)తో పోల్చి చూసినా, ఎక్కువగానే అనిపిస్తుంది. పైగా, కొందరు బడా హీరోలు మునుపెన్నడూ లేని విధంగా వసూళ్ళలో యాభై కోట్ల మైలురాయిని అందుకున్నదీ ఈ ఆరు నెలల్లోనే. అయితే, చూడడానికి, వినడానికి బాగున్నట్లనిపించే ఈ అంకెలను చూసి, అంతా ‘ఆహా ఓహో’ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. నిక్కచ్చిగా చెప్పాలంటే, ఈ ఆరు నెలలూ ఆశించినంత గొప్పగా గడిచాయా అంటే అనుమానమే.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మొదలై విభజిత ఆంధ్రప్రదేశ్, నూతన ఆవిర్భావ తెలంగాణ - అనే రెండు రాష్ట్రాల తెలుగు నేలలో పయనం సాగించాల్సిన కొత్త పరిస్థితి ఈ కాలఘట్టంలోనే తెలుగు సినిమాకు వచ్చింది. ఒక పక్క రాష్ట్ర విభజన వివాదం, మరో పక్క సమైక్య రాష్ట్ర శాసనసభ ఆఖరు ఎన్నికలతో పాటు నడిచిన సార్వత్రిక ఎన్నికల సంగ్రామం సహజంగానే మన సినిమా మీదా ప్రభావం చూపింది. ఫలితంగా గడచిన ఆరు నెలల్లో దాదాపు మూడో వంతు కాలం పాటు కాస్తంత పెద్ద హీరోల సినిమాలు హాళ్ళ దాకా రావడానికి తటపటాయించాయి. హాళ్ళపై బడా చిత్రాల కబంధ హస్తాల పట్టు కాస్తంత సడలగానే, చిన్నాచితకా సినిమాలు రెక్కలు విప్పుకున్నాయి. ఒక్కో వారంలో ఆరేడు చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల్ని పలకరించాయి. అలా సినిమా టైటిల్ కానీ, నటీనటులు, దర్శక, నిర్మాతల పేర్లు కానీ వినని, విన్నా గుర్తుండని ఈ చిన్న చిత్రాల ప్రవాహం గత ఆరు నెలల్లో పెరిగిన తెలుగు సినీ నిర్మాణం తాలూకు వాపును చూపెట్టింది. బలిమిని పెంచడానికి మాత్రం ఏ రకంగానూ తోడ్పడలేదు.
భారీ విజయాలు
ఎప్పటిలానే ఈ తొలి ఆరు నెలల్లో కూడా మూడు నాలుగే పెద్ద హిట్లు, అంతకు పదింతల పెద్ద పెద్ద ఫ్లాపులు తెలుగు సినిమాకు వచ్చి పడ్డాయి. బాలకృష్ణ - బోయపాటి శ్రీను ‘లెజెండ్’, అల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి ‘రేసు గుర్రం’ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు తెచ్చి, సూపర్‌హిట్లుగా నిలిచాయి. రామ్‌చరణ్ తేజ్- వంశీ పైడిపల్లి ‘ఎవడు’ భారీ నిర్మాణ వ్యయాన్ని వెనక్కి రాబట్టి, లాభాల బాటలో నడిచి హిట్ అయింది. ఉపగ్రహ ప్రసార హక్కులు, రీమేక్ రైట్లతో కలిపి, ఈ చిత్రాలన్నీ ఆదాయంలో 50 కోట్ల మార్కును సైతం దాటేశాయి. బాలకృష్ణ (రూ.50+ కోట్లు), అల్లు అర్జున్ (రూ. 60+ కోట్లు) ఆ స్థాయి విజయాలు దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఇక, అక్కినేని ఆఖరు చిత్రం ‘మనం’ ఈ యాక్షన్ చిత్రాలకు భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఆకట్టుకొని, వసూళ్ళలో రూ. 30+ కోట్ల క్లబ్‌లోనే చేరింది.
పెద్ద హీరోలకూ, దర్శకులకూ ఎదురుదెబ్బ
గమ్మత్తేమిటంటే, ఈ ఆరు నెలల ఫ్లాపుల్లో పెద్ద హీరోల సినిమాలు, పేరున్న దర్శకుల సినిమాలు కూడా ఉండడం! స్టార్ హీరోల్లో మహేశ్‌బాబు నటించిన ‘1 (నేనొక్కడినే)’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొన్ని పదుల కోట్ల విఫల ప్రయోగంగా మిగిలింది. ఇక, యువ హీరో నానితో దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ‘పైసా’ ఆలస్యంగానైనా థియేటర్ల దాకా రాగలిగింది కానీ, ఆదరణకు నోచుకోలేకపోయింది. హిందీ హిట్ ‘కహానీ’కి కొన్ని మార్పులతో తెలుగు రీమేక్‌గా శేఖర్ కమ్ముల చాలా కాలం తీసిన ‘అనామిక’ సైతం తీసినన్ని రోజులు కాకపోయినా, కనీసం అన్ని ఆటలైనా ప్రదర్శితం కాకుండా అనామకంగా వెళ్ళిపోయింది. రామ్‌గోపాల్ వర్మ తన హిట్ హిందీ చిత్రమైన అమితాబ్ ‘సర్కార్’ ఛాయల్లో రూపొందించిన ‘రౌడీ’ ఆయన ఫ్లాపుల ఖాతాలో మరో అంకెను పెంచింది.
మోహన్‌బాబు కుటుంబం నిర్మించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ కూడా వచ్చిన టాక్ స్థాయిలో వసూళ్ళు రాని సినిమాగా మిగిలింది. సుమంత్‌తో దర్శకుడు చంద్రసిద్ధార్థ చేసిన ‘ఏమో... గుర్రం ఎగరావచ్చు’ కనీసం నడవనైనా నడవలేక చతికిలపడింది. ఏళ్ళ తరబడి చిత్ర నిర్మాణంలో ఉండిపోయి, విడుదలకు అనేక అవాంతరాలను ఎదుర్కొన్న సెన్సిబుల్ దర్శకుడు దేవా కట్టా తాజా చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో తీసిన ‘ఉలవచారు బిర్యాని’ మలయాళ మాతృకలోని సున్నిత భావోద్వేగాలను తెలుగులో పునఃసృష్టించడంలో విఫలమైంది.
వికటించిన వినోదాలు...
హీరో ‘అల్లరి’ నరేశ్‌ను విపరీత స్థూలకాయుడి వేషంలో దర్శకుడు ‘అల్లరి’ రవిబాబు చూపిన ‘లడ్డుబాబు’ కానీ, తమిళ హిట్ ‘కలగలప్పు’కు తెలుగు రీమేక్‌గా నరేశ్ ద్విపాత్రాభినయం చేసిన ‘జంప్ జిలానీ’ కానీ ప్రేక్షకులకే కాదు, ఆ నిర్మాతలకు కూడా ముఖం మీద చిరునవ్వు తేలేకపోయాయి. బుల్లితెర పాత్రలతో గుణ్ణం గంగరాజు తీసిన ‘అమృతం... చందమామలో’, దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆరు కథల మేళవింపు ‘చందమామ కథలు’ లాంటివి బాగున్నాయనిపించుకున్నా, ఆ స్థాయి వసూళ్ళు తేలేదు. ఇక నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా అవతారమెత్తిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి ఫలితం తేలాల్సి ఉంది.
విఫల ప్రయోగాలు
అంధ బాలబాలికలే ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు అయోధ్యకుమార్ తొలి చిత్రం ‘మిణుగురులు’ ఆలోచింపజేసే ప్రయోగమైనా, ఆదరణకు నోచుకోలేదు. ప్రముఖ సాహితీవేత్త తిలక్ కథ ఆధారంగా నరసింహ నంది రూపొందించిన ‘కమలతో నా ప్రయాణం’ పరిస్థితీ అంతే. సమకాలీన రాజకీయ వ్యవస్థపై బాణాలు సంధించిన ‘ప్రతినిధి’ రిపోర్ట్ బాగున్నా రెవెన్యూ లేక, వాణిజ్య వైఫల్యంగానే మిగిలింది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా అతి చిన్న సినిమాకు సైతం అమిత క్రేజ్ తీసుకురావచ్చని తెలంగాణ ప్రాంత కొత్త హీరో సంపూర్ణేష్‌బాబుతో దర్శకుడు స్టీవెన్ శంకర్ (సాయి రాజేశ్) తీసిన ‘హృదయ కాలేయం’ ఋజువు చేసింది. ఈ ‘వినోదాత్మక వ్యంగ్య చిత్రం’ కొన్నిచోట్ల చక్కటి ప్రారంభ వసూళ్ళు సాధించినా, చివరకు నష్టమే మిగిల్చింది.
సెలైంట్ హిట్లు
కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల టాక్ అటూ ఇటూగా ఉన్నా, అయిన ఖర్చు కన్నా ఎక్కువే వసూలు చేసి, వాణిజ్య విజయాలయ్యాయి. నితిన్‌తో పూరీ జగన్నాథ్ తీసిన ‘హార్ట్ ఎటాక్’ (రూ. 17 కోట్ల పైగా), ఓ కన్నడ హిట్ ఆధారంగా సునీల్‌తో తెలుగులో వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ లాంటివి అందుకు ఉదాహరణ. మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన ‘కొత్త జంట’ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాపార ఫలితాన్ని అందుకొంది. మొత్తం మీద అయిన ఖర్చు కన్నా, రాబడే (రూ. 5 కోట్ల పైగా) ఎక్కువొచ్చి, సక్సెస్‌గా నిలిచింది.
పస తగ్గిన అనువాదాలు
చిత్రంగా ఈ ఆరు నెలల్లో తెలుగులోకి వచ్చిన అనువాదాల్లో చెప్పుకోదగినవి అంతంత మాత్రమే. చిన్న చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందించిన డబ్బింగ్ సినిమా ‘ట్రాఫిక్’ వసూళ్ళ కన్నా, టాక్ ఎక్కువ తెచ్చుకుంది. తమిళం నుంచి తెలుగులోకి ఆలస్యంగా తర్జుమా అయిన ఆర్య, నయనతారల ‘రాజా - రాణి’ ఇక్కడా నిర్మాతకు లాభాలు తెచ్చింది. ఆ రెండింటినీ మినహాయిస్తే, ఆశలు పెట్టుకున్న విశాల్ ‘ధీరుడు’, రజనీకాంత్ ‘విక్రమ సింహ’, నాని ‘ఆహా కల్యాణం’ వగైరాలన్నీ థియేటర్లలో సినిమాలను నింపాయే తప్ప, ప్రేక్షకులను నింపలేకపోయాయి.
పరిశ్రమ ఎక్కడ?
ఈ అర్ధ సంవత్సర కాలంలోనే ప్రకాశ్‌రాజ్‌కూ, దర్శకుల సంఘానికీ మధ్య వివాదం రేగి, పరిస్థితి పంచాయతీ దాకా వెళ్ళింది. జూన్ 2న ‘ప్రత్యేక తెలంగాణ’ అధికారికంగా ఆవిర్భవించి, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు అందరూ రెండూ రాష్ట్రాలకూ విభజన అయిపోయిన నేపథ్యంలో, సినీసీమలోనూ ప్రాంతీయతా విభేదాలు నివురుగప్పిన నిప్పులా కనపడకుండా రాజుకొంటున్నాయి. సినీ పరిశ్రమ కూడా విభజన దిశగా అడుగులు వేస్తోందా అన్న అనుమానం పెరిగింది. స్థానికులకే అవకాశాలు దక్కాలనీ, సీమాంధ్రుల గుత్తాధిపత్యానికి చెల్లుచీటీ ఇవ్వాలనీ తెలంగాణ సినీ వర్గాలు స్వరం పెంచడంతో - కొన్ని దశాబ్దాల కృషితో మద్రాసు నుంచి తెలుగునేలకు తరలివచ్చిన సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంటుందా, విశాఖపట్నం లాంటి కొత్త తీరాలకు తరలిపోతుందా అన్న అనిశ్చితి మొదలైంది.
ఇప్పటి దాకా ప్రాంతాలకు అతీతంగా తెలుగు సినిమా మొత్తానికీ దక్షిణాదిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ.పి. ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ లాంటివి ‘ఏ.పి’ అనే బదులు ‘తెలుగు’ అంటూ పేరు మార్చుకోవాలని తర్జనభర్జన పడుతున్నాయి. మరోపక్క సినిమాటోగ్రఫీ శాఖను తామే స్వయంగా నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తేడాపాడాలు లేకుండా ఒకే రకమైన పన్ను విధానం ద్వారా రెండు ప్రాంతాల్లోనూ తెలుగు సినిమా ఒకేలా మనగలిగేలా చేస్తారా అన్నది ఇప్పటికీ బేతాళప్రశ్నే. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల కాలం తెలుగు సినీ పరిశ్రమ భవితవ్యానికి కీలకం కానుంది.
2014 - హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ హిట్లు గోరంత... ఫ్లాపులు కొండంత!
Published Mon, Jun 30 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement