గాసిప్స్ బాధిస్తున్నాయి
తన గురించి చాలా వదంతులు ప్రచారం చేస్తున్నారు. అవి వ్యక్తిగత జీవితాన్ని బాధిస్తున్నాయని విచారాన్ని వ్యక్తం చేశారు నటి సమంత. టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వెల్లడించి కొత్త చర్చకు దారి తీసిన ఈ చెన్నై చిన్నది తను నటించే చిత్రాలనూ తగ్గించుకుంటూ వచ్చారు. నటుడు ధనుష్‌కు జంటగా నటించాల్సిన వడచెన్నై చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఒకే ఒక్క తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌లో నటిస్తున్నారు. ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
సమంత నటనకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించడానికి పచ్చజెండా ఊపి మరోసారి చర్చకు తావిచ్చారు. ఇలాంటి పరిస్థితిలో ఈ చెన్నై చిన్నది తన మనసులోని మాటల్ని బయట పెట్టారు. అవేమిటో తన మాటల్లోనే. నాపై గాసిప్స్ చాలా ప్రచారం చేస్తున్నారు. అవి నా వ్యక్తిగత జీవితాన్ని వివాదం చేస్తున్నాయి. ఇది బాధాకరం. చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. కొందరు పనికట్టుకుని ఎగతాళి చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటివి హర్షణీయం కాదు. బ్రహ్మోత్సవం చిత్రంలో నటుడు నాజర్ మంచి విషయాల గురించి ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు అన్న డైలాగ్‌ను పదేపదే చెబుతారు. అది నాకు బాగా నచ్చింది.
మన చుట్టూ చాలా మంచి విషయాలు జరగుతున్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇతరులను విమర్శించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి పేపర్లో చదువుతున్నాం. మంచి విషయాల గురించి చర్చించడం వల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి. అది ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా చెడు అలవాట్లకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరం మంచి విషయాల గురించే చర్చించాలని ఎవరికి వారు ప్రమాణం చేసుకుంటే మంచిది.