అగ్ర కథానాయకిగా రాణిస్తానని తనకు ముందే తెలుసు అని చెప్పింది నటి హన్సిక. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా సెటిల్ అయిన నటి హన్సిక. ముఖ్యంగా కోలీవుడ్‌లో మాప్పిళ్‌లై చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆపై వరుసగా అవకాశాలను అందుకుని, దర్శకుల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో విజయాల శాతమే అధికం అని చెప్పవచ్చు.
మొత్తం మీద అర్ధశతకానికి రీచ్ అయిన ఈ అమ్మడి ఖాతాలో మహా అనే చిత్రం అర్ధశతకంగా నమోదు అవుతోంది. త్వరలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆనందంలో తుల్లిపోతున్న హన్సిక మాట్లాడుతూ 50వ చిత్రంలో నటించబోతుండడం చాలా సంతోషంగా ఉందంది. మహా చిత్ర కథ హీరోయిన్ సెంట్రిక్‌తో కూడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి కథా చిత్రంలో నటించడం ఇదే ప్రప్రథమం అని తెలిపింది. అందుకే ఇందులో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది.
ఈ చిత్రం బాగా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పింది. మహా చిత్ర దర్శకుడు జమీల్ తనకు ముందే తెలుసని, బోగం చిత్రాలకు తామిద్దరం కలిసి పని చేశామని చెప్పింది. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పడానికి ఆరు నెలలు ఎదురు చూశారని, తాను బిజీగా ఉండడంతో ఆయన్ని కలిసి కథ వినడం కుదరలేదని తెలిపింది. ఎట్టకేలకు ఒక సమయంలో దర్శకుడు తనను కలిసి కథ వినిపించారని, అయితే అప్పుడు అందులో నటించడానికి అంగీకరించలేదని అంది. రెండవసారి మరోసారి కథ చెప్పినప్పుడు ఓకే చెప్పానంది. అయితే ముందు కథ విన్నప్పుడే మహా చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.
అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి
సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌ని అవుతానని తనకు ముందే తెలుసని చెప్పింది. ఎందుకంటే తాను కఠినంగా శ్రమిస్తానని అంది. అందుకే తనను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటిస్తానని, అగ్ర కథానాయకినవుతానని తెలుసంది. ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పింది. పలువురు లెజెండ్స్‌ను కలిసి మాట్లాడుతున్నానని, తప్పులు చేయడం సహజం అని, అయితే తప్పు చేశానే అని దాన్నే తలుచుకుని బాధ పడుతూ కూర్చునే మనస్తత్వం తనది కాదని చెప్పింది. తాను గత ఏడాది మాత్రమే 19 చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇంతకుముందు ఏడాదికి 8 చిత్రాల వరకూ చేసేదాన్నని, ఇప్పుడు ఏడాదికి 4 చిత్రాలే చేస్తున్నానని తెలిపింది. అలాగని పనిలేకుండా ఖాళీగా ఉంటున్నట్లు భావించరాదని అంది. ప్రస్తుతం రెండు చిత్రాలను పూర్తి చేసి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment