మహేష్‌బాబు సలహా పాటిస్తున్నా
‘హృదయం ఎక్కడున్నది’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కొత్త హీరో కృష్ణ మాధవ్. తను మహేష్‌బాబుకి దగ్గర బంధువు. ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో పవన్, సంజయ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృష్ణమాధవ్ మాట్లాడుతూ -‘‘త్రివిక్రమ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ సమయంలోనే నటనలో కొన్ని మెళకువలు నేర్చుకున్నా. అలాగే, సూర్య, విక్రమ్‌వంటి ఆర్టిస్టులకు శిక్షణ ఇచ్చిన గురువు దగ్గర చెన్నయ్‌లో నేనూ శిక్షణ తీసుకున్నా.
చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది. నటుడవ్వాలనే నా కోరికను ఓసారి మహేష్‌బాబుకి చెబితే, ‘సవాల్‌గా తీసుకుని, గట్స్‌తో నటిస్తే రాణించగలుగుతావ్’ అన్నారు. ఆ సలహాని పాటిస్తున్నా. అలాగే సెట్స్‌లో మహేష్‌బాబు నటనను దగ్గరగా చూడటం ఉపయోగపడింది. ఓ నటుడికి ఎలాంటి లక్షణాలుండాలో ఆయన్ను చూసి తెలుసుకున్నా’’ అని చెప్పారు. ‘హృదయం ఎక్కడున్నది’లో చేసిన పాత్ర గురించి చెబుతూ -‘‘ఒక అమ్మాయికి మనసిచ్చి వేరే అమ్మాయిపట్ల ఆకర్షితుణ్ణయ్యే కుర్రాడి పాత్రను ఇందులో చేశా. ప్రతి గల్లీల్లోనూ ఇలాంటి కుర్రాడు ఉంటాడు. ప్రేమలో స్ధిరత్వం ఉండాలని అంతర్లీనంగా సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు కృష్ణమాధవ్.