మా అమ్మే ఇప్పుడు నా కూతురు!
– ఆనందంలో నాగార్జున
చీరపై ప్రేమకథ!
ఈ నిశ్చితార్థ వేడుక కోసం సమంత కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... చై, తన ప్రేమకథను బొమ్మల రూపంలో చీరపై సమంత డిజైన్ చేయించింది.
సమంత నవ్వులో ఓ మాయ దాగుంది. ఆ మాయలో నాగచైతన్య (చైతు) ఉన్నాడు. మరి, చైతూ నవ్వుల్లో ఉందెవరు? సమంతే. ఈ ఇద్దరి మనసుల్లోనూ ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఉంది. ఆ ప్రేమ రెండు మనసుల్నీ ఒక్కటి చేసింది. పెద్దలకు తమ ప్రేమ అర్థమయ్యేలా చేసింది. ఇంకేముంది? మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వమని ఆశీర్వదించారు. ఆ మనసులు రెండూ త్వరలో మనువాడబోతున్నాయి. మనువుకి ముందు జరిగే నిశ్చితార్థం ఆదివారం సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకి హైదరాబాద్‌లోని ‘ఎన్ కన్వెషన్ సెంటర్’ వేదికైంది.
సమంత క్రిస్టియన్ కాబట్టి... క్రైస్తవ సంప్రదాయంలోనూ, ఇటు అక్కినేని కుటుంబానికి తగ్గట్టు హిందూ సంప్రదాయంలోనూ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాబోయే భార్యకు చైతన్య ఉంగరం తొడిగి, ఆత్మీయంగా ముద్దాడారు. నవ్వుల్లో మునిగిన సమంత మురిసిపోయింది. ‘‘చై–సామ్‌ల బంధం ఇక అఫీషియల్. నా తల్లి ఇప్పుడు నా కూతురు అయ్యింది. ఇంతకంటే మరో ఆనందం ఉండదు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అని నాగ్ పేర్కొన్నారు. ‘మనం’ సినిమాలో నాగ్‌కి తల్లిగా సమంత నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘నాకో బ్రదర్.. నా కొత్త సిస్టర్. ఈ ప్రపంచంలో అత్యంత ఆనందమైన తమ్ముణ్ణి నేను’’ అని అఖిల్ ట్వీట్ చేశారు.