హీరో, హీరోయిన్ లేని సినిమా
హీరో హీరోయిన్లు లేకుండా తెరకెక్కిన చిత్రాలు అరుదే. అలాంటి కోవలో పాది ఉనక్కు పాది ఎనక్కు చిత్రం చేరనుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లే కాదు ప్రేమ సన్నివేశాలు ఉండవంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఎంఏ విజయకుమార్. లైట్‌బాక్స్ ప్రొడక్షన్స్, ప్రియా మినీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నటుడు ఆర్యన్ అలెక్స్, ఆనంద, శరవణన్, స్వాతి, దివ్యశ్రీ, రీతు బేబి నిఖిత, మణిమారన్, విజయ్ గణేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తల్లిదండ్రుల హిత వ్యాఖ్యల్ని పెడ చెవిన పెట్టిన ఒక యువతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ధనబలం, అంగబలంతో విచ్చలవిడిగా ప్రవర్తించే వారి చివరి జీవితం ఎలాంటి స్థితికి చేరుకుంటుందన్న అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం పాది ఉనక్కు పాది ఎనక్కు అని తెలిపారు. ఇది ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రం అన్నారు.
చిత్రంలో హీరో హీరోయిన్లు, ప్రేమ సన్నివేశాలు లేకపోయినా ప్రేక్షకులను అలరించే, ఆలోచింప చేసే అంశాలు చాలా ఉన్నాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, సెంజి, అరక్కోణం, దిండివనం, ఊటి తదితరప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఎస్‌పీఎల్ సెల్వదాసన్, ఎం ఆర్ బాలన్, హెచ్.గణేష్ మొదలగు ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. వి ఎస్ బాలాజి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానికవడపళనిలో గల ఆర్ కె వి స్టూడియోలో జరిగింది.