ఆ సినిమాల్లా ‘ఓయ్.. నిన్నే’ కూడా హిట్టవ్వాలి
– మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
‘తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి సహా ఎందరో వేసిన దారి ఇప్పుడు ఎంతో బాగుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చిత్రపరిశ్రమకు కొత్త నటీనటులు రావాల్సిన అవసరం ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. భరత్, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా ‘ఓయ్.. నిన్నే’. శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
తలసాని మాట్లాడుతూ– ‘‘బాహుబలి, శ్రీమంతుడు’ నుంచి ఈ మధ్య విడుదలైన ‘ఫిదా’వరకు మంచి సినిమాలు వస్తూ, ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అదే కోవలో ‘ఓయ్.. నిన్నే’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లో ‘సోలో’ నాకు బాగా నచ్చింది. ‘ఓయ్ నిన్నే’ చిత్రం ‘సోలో’ సినిమా కంటే బాగుంటుంది’’ అన్నారు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్. చిత్రదర్శకుడు సత్య చల్లకోటి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శేఖర్‌చంద్ర, సృష్టి, దర్శకులు అనిల్ రావిపూడి, చంద్రసిద్ధార్థ్, రచయిత కోన వెంకట్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణచైతన్య పాల్గొన్నారు.