హైదరాబాద్ సిటీతో నాకు చాలా అనుబంధం ఉంది..సిటీకి నెలలో రెండు, మూడు పర్యాయాలు వచ్చి నచ్చినప్రాంతాలకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలియ తిరిగి ముంబయ్‌కు వెళతానంటున్నారు బాలీవుడ్ సింగర్, నటుడు అర్మన్ మాలిక్. స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి హిట్ చిత్రంలోపాట పాడి అలరించారు. పెప్సీ కంపెనీనిర్వహిస్తున్న ‘‘హర్ గ్నూథ్ మెయిన్ స్వాగ్’ ప్రచారం నిమిత్తం ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అర్మన్ మాలిక్ విచ్చేశారు. మ్యాచ్ అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగాముచ్చటించారు. ఆ వివరాలు.. ఆయన మాటల్లోనే...
♦ అమితాబ్‌ని మెప్పించా
చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. సింగర్ అవ్వాలని కలలు కనేవాడ్ని. పదో ఏట నుంచి గిటార్ నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి సినిమాను చూస్తూ, సినిమాల్లో వచ్చే పాటలను, సింగర్లను ఫాలో అవుతుండేవాడ్ని. స్కూలు, కాలేజీలో నచ్చిన పాటలు పాడుతూ నా ఫ్రెండ్స్‌ని, టీచర్స్‌ను మెప్పించాను. 2008 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘భూత్‌నాథ్’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మేరేబడ్డీ’ పాట పాడివినిపించాను. ఓకే అన్నాక సినిమాకు పాడాను. ఆ పాట విన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ నన్ను మెచ్చుకుని కీప్ ఇట్ అప్ అంటూ మెచ్చుకున్నారు.
♦ సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా
2014లో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీఫెలో’ సినిమాతో పరిచయం అయ్యాను. ‘ఏదో నువ్వన్న’ అనే రొమాంటిక్ సాంగ్‌ని పాడే అవాకాశం వచ్చింది. 2016 ‘ఎంఎస్ ధోనీ’ సినిమాలో తెలుగు, తమిళంలో కలిపి మూడు సాంగ్స్ నేనే పాడాను. ‘కాటమరాయుడు’ సినిమాలో ‘ఏమో..ఏమో..’ సాంగ్, అఖిల్ సినిమా ‘హలో’లో ‘హలో ఎక్కడున్నావ్’ టైటిల్‌సాంగ్, ‘అరవింద సమేత’లో ‘అనగనగ’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో ‘బ్యూటిఫుల్ లవ్’, ఏక్తాలో ‘ఇదివరకెప్పుడు’, పడిపడిలేచే మనసు సినిమాలో ‘పడి పడిలేచే మనసు’, మిస్ట్టర్ మజ్నులో ‘కోపంగా..కోపంగా’.. పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా..
♦ చార్మినార్, ట్యాంక్‌బండ్ అంటే ఇష్టం
మా అమ్మమ్మ, తాతయ్యలు, బంధువులు అంతా సిటీలోనే స్థిరపడ్డారు. వారిని చూసేందుకు ఇక్కడకు వస్తుంటా. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్‌తో కలసి సిటీలో నైట్ రైడ్ చేస్తుంటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుంటా. ట్యాంక్‌బండ్, చార్మినార్‌లు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు తిరిగిన రోడ్లే కదా..ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలసి తిరుగుతుంటే మస్త్ మజా వస్తుంది.
♦ గోంగూరుకు ఫేవరేట్‌ని నాకు తెలుగు వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ‘గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర రోటి పచ్చడి, గోంగూర పచ్చడి’కి నేను ఫేవరెట్‌ని. వీటితో పాటు హైదరాబాద్ బిర్యానీకి చిన్నప్పటి నుంచే ఫ్యాన్‌నే.
♦ బన్నీ సినిమాలు చూస్తా
నాకు హీరో అల్లుఅర్జున్(బన్నీ) అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు తరచూ చూస్తుంటా. ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాకు పాట పాడేటప్పుడు ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఆయన సిగ్నేచర్ అంటే నాకు పిచ్చి. తెలుగులో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. చాలా మంది నా సినిమాలో పాడు అని అడుగుతున్నారు. నేను ఎక్కువగా థమన్‌ని ఫాలో అవుతుంటాను. అందుకే ‘అరవింద సమేత’ సినిమాలో పాటపాడగలిగా.
Comments
Please login to add a commentAdd a comment