ఏయన్నార్ పంచెలతో... సోగ్గాడి పంచ్‌లు
‘‘ఏయన్నార్ అంటే పంచెకట్టు... పంచెకట్టు అంటే ఏయన్నార్. అంతలా నాన్న గారి పంచెకట్టు బాగా పాపులర్. నాన్న పంచెకట్టుతో చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. నాన్న పాత సినిమాల్లో వాడిన పంచెలను నేనీ సినిమా కోసం వాడాను. అలాగే 1959లో నాన్న కొన్న రిస్ట్‌వాచ్‌ను కూడా నేను ఉపయోగించాను. అందుకే ఈ ‘బంగార్రాజు’ గెటప్ అక్కినేని అభిమానులకు తీపి గుర్తుగా నిలిచిపోతుంది’’ అంటున్నారు నాగార్జున. కళ్యాణ్‌కృష్ణ కురసాలను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మించిన ఈ చిత్రం రానున్న సంక్రాంతికి రానుంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ నాయికలుగా నటించారు.