బలవంతంగా లవ్ యు చెప్పించుకుంటే..!
ఒక్క చూపుతో తామేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసే నేర్పు చాలామందికి ఉంటుంది. అలాగే, ఎదుటి వ్యక్తి తమను చూసే చూపును బట్టి, తమ గురించి వాళ్లేమనుకుంటున్నారో ఊహించేసే నేర్పూ ఉంటుంది. శ్రుతీహాసన్ లాంటి నాయికలు సినిమాల్లో కళ్లతోనే హావభావాలు పలికించి, ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తారు. అలాగే, ఈ బ్యూటీని కన్నారప్పకుండా చూసే కుర్రకారూ ఉంటారు.
శ్రుతి లాంటి అందగత్తెలు మగవాళ్ల చూపుల నుంచి తప్పించుకోవడం కష్టమే. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘కంటికి అందంగా కనిపించే ప్రదేశాలను పదే పదే చూడాలనుకుంటాం. అలాగే, అందంగా కనిపించేవాళ్లను చూసేకొద్దీ చూడ బుద్ధేస్తుంది. అందమైన అమ్మాయిలను అబ్బాయిలు చూడటం కామన్. అయితే, ఆరాధనగా చూసినంతవరకూ ఓ.కె. వెకిలిగా చూస్తేనే ఒళ్లు మండుతుంది. అలాగే కంటికి నచ్చిన ప్రతి అమ్మాయీ తమ సొంతం కావాలనుకోవడం కరెక్ట్ కాదు.
ఆ అమ్మాయికి నచ్చితే సరే... నచ్చనప్పుడు ఒత్తిడి చేయకూడదు. బలవంతంగా ‘ఐ లవ్ యు’ చెప్పించుకుంటే, మనసులో అసహ్యం మాత్రమే ఉంటుంది తప్ప ప్రేమ అయితే ఉండదు. ఆడవాళ్ల మనోభావాలను గౌరవించాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను మాత్రమే కాదు... బయట కనిపించే ఆడవాళ్లను కూడా గౌరవించడం సంస్కారం అనిపించుకుంటుంది’’ అన్నారు. పాయింటే కదా!